ఫరీదాబాద్: హర్యానాలోని గ్రేటర్ ఫరీదాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. తల్లి తమతో పాటు ఉండకూడదని భార్య, అత్తామామలు, బావమరుదులు వేధిస్తుండటంతో తీవ్రంగా కలత చెందిన ఒక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుని మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన కుమార్ గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రేడియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి తొమ్మిదేళ్ల క్రితం నేహా రావత్‌తో వివాహం జరిగింది. వారికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఈ దంపతులు గతంలో నోయిడాలో ఉండేవారు. అక్కడ నేహా ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేది.. మృతుడి మామ ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటంతో వారు కుమార్తెను చూసుకోలేకపోయారు. ఈ నేపధ్యంలో యోగేష్ తన తల్లిని తమతో పాటు ఉండేలా చూసుకోవాలని అనుకున్నాడు. అయితే నేహా ఇందుకు అంగీకరించలేదు.
ఆరు నెలల క్రితం యోగేష్ తన కుమార్తెతో సహా గ్రేటర్ ఫరీదాబాద్‌లోని సెక్టార్ 87లోని పెర్ల్ సొసైటీకి మారాడు. అయితే నేహా.. నోయిడా నుండి యోగేష్‌తో పాటు ఇక్కడికి రాలేదు. దీంతో యోగేష్ తమ కుమార్తెను చూసుకునేందుకు తన తల్లిని తీసుకువచ్చాడు. ఇంతలో నేహా తన యోగేష్‌తో పాటు ఉండేందుకు పెర్ల్ సొసైటీ అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. తరువాత యోగేష్ తల్లి తమతో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నేహా తల్లిదండ్రులు, సోదరులు ఆశిష్ రావత్, అమిత్ రావత్ కూడా ఈ విషయమై యోగేష్‌తో గొడవ పడ్డారు. దీంతో యోగేష్ తీవ్రంగా కలత చెందాడు.
గురువారం, యోగేష్ తన భార్య నేహాను గ్వాలియర్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తూ, నేహాను నోయిడాలో దింపి, ఒంటరిగా తమ అపార్ట్‌మెంట్‌కు తిరిగి వచ్చాడు. శుక్రవారం రాత్రి పెర్ల్ సొసైటీలోని 15వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని అతని మామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు మృతుని భార్య నేహా రావత్, అత్త శాంతి రావత్, మామ వీర్ సింగ్ రావత్, నేహా సోదరులు ఆశిష్, అమిత్ రావత్ లపై కేసు నమోదు చేశామని భూపాని పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంగ్రామ్ దహియా మీడియాకు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి: కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు


