వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తన ప్రతాపం చూపారు. తాజాగా కెనడియన్ వస్తువులపై సుంకాలను అదనంగా 10 శాతం మేరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దివంగత అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నాడు సుంకాలపై చేసిన ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్పులను కెనడా వినియోగించిన దరిమిలా ఆగ్రహంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పొరుగు దేశమైన కెనడా రూపొందించిన ఒక టీవీ వాణిజ్య ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. అమెరికా ఇటీవలే కెనడాపై 35 శాతం నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించింది. అయితే ఈ సుంకాల తగ్గింపుపై రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటిపై ఒక ఒప్పందం కుదురుతుందని కెనడా అధికారులు భావిస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా జరిగింది.
కెనడా ప్రధాని మార్క్ కార్నీ- డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవలే ఓవల్ ఆఫీస్‌లో స్నేహపూర్వక సమావేశం జరిగింది. అయితే ఇంతలోనే ఊహించని విధంగా ట్రంప్.. కెనడాతో చర్చల రద్దును ప్రకటించారు. దీనికి కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ప్రసారం చేసిన ఒక టీవీ ప్రకటన అని సమాచారం. ఈ ప్రకటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ .. సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికన్లకు ముప్పు తీసుకొస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన గత వారం రోజులుగా అమెరికా టీవీ ఛానెల్స్‌లో ప్రసారమవుతోంది.
అమెరికా ప్రవేశపెడుతున్న సుంకాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది. ఈ నేపధ్యంలో కోర్టు తీర్పును ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే కెనడా ఈ ప్రకటనను ప్రచారంలోకి తీసుకొచ్చిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కాగా దీనిపై రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ కూడా స్పందించింది. సదరు ప్రకటనను ఖండించింది. ‘వారు ఈ ప్రకటనను వెంటనే తీసివేయాలి. అది మోసపూరితమైనదని తెలిసి కూడా వారు వరల్డ్ సిరీస్ సమయంలో దానిని ప్రసారం చేయడానికి అనుమతించారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో పేర్కొన్నారు. వాస్తవాలను తప్పుగా చూపించడంలాంటి శత్రు చర్యల కారణంగా కెనడాపై సుంకాన్ని.. వారు ఇప్పుడు చెల్లిస్తున్న దానికంటే 10 శాతం అదనంగా పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: ‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం


