పుణే/సతారా: మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మహిళా ప్రభుత్వ వైద్యురాలి ఆత్మహత్య కేసులో నిందితుడైన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ గోపాల్ బదానేను శనివారం సాయంత్రం అరెస్ట్ చేశారు. అతని సహ నిందితుడు పట్టుబడిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఫల్తాన్ పోలీసుల బృందం పూణేలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రశాంత్ బంకర్‌ను అరెస్టు చేసింది. వైద్యురాలు రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఇద్దరు ఆరోపితులలో ప్రశాంత్ బంకర్ ఒకరు.
సతారా ఎస్పీ తుషార్ దోషి తెలిపిన వివరాల ప్రకారం ఎస్‌ఐ బదానే ఫల్తాన్ గ్రామీణ పోలీసు స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మరోవైపు బాధితురాలిని మానసికంగా వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ బంకర్‌ను సతారా జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. మహారాష్ట్రలోని మరాఠ్వాడ పరిధిలోని బీడ్ జిల్లాకు చెందిన వైద్యురాలు గురువారం రాత్రి ఫల్తాన్ పట్టణంలోని ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలు తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్‌లో, పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ బదానే తనపై పలుమార్టు అత్యాచారం చేశాడని, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన బంకర్ తనను మానసికంగా వేధించాడని ఆరోపించారు. ఈ నేపధ్యంలో వీరిద్దరిపై కేసు నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం ప్రశాంత్ బంకర్.. ఆ వైద్యురాలు ఉంటున్న ఇంటి యజమాని కుమారుడు. కేసు దర్యాప్తులో సబ్-ఇన్‌స్పెక్టర్ బదానే పేరు బయటకు రాగానే ఉన్నతాధికారులు ఆయనను సర్వీసు నుండి సస్పెండ్ చేశారు. కాగా ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ వేధింపులపై పలుమార్టు ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఆమె బంధువు మీడియా ముందు ఆరోపించారు. మహిళా వైద్యురాలిని వేధించిన ఎంపీని ఈ కేసులో నిందితునిగా చేర్చాలని బీజేపీ ఎమ్మెల్యే సురేష్ ధాస్ డిమాండ్ చేశారు. కాగా మృతురాలు తన ఎంబీబీఎస్ చదువు కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం ఇంకా తిరిగి చెల్లించలేదని ఆమె మామ మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: Singapore: విజిటర్‌ను వేధించిన భారత నర్సుకు జైలు


