సింగపూర్: భారతీయ స్టాఫ్ నర్సుకు జైలు శిక్ష పడిన ఉదంతం సింగపూర్‌లో చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన ఒక పురుషుడిని వేధించినందుకు ఒక మేల్ నర్సుకు శిక్ష పడింది. సదరు మేల్ నర్సు కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన దరిమిలా అతనికి శిక్ష ఖరారయ్యింది. ఒక సంవత్సరం, రెండు నెలల జైలు శిక్షతోపాటు, రెండు బెత్తం దెబ్బలను అతనికి శిక్షగా విధించారు.
సింగపూర్‌లోని రాఫెల్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న భారతీయ స్టాఫ్ నర్సు ఏలిపె శివ నాగు(34) జూన్ 18న లైంగిక వేధింపుల ఆరోపణల్లో దోషిగా తేలాడు. ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’ తెలిపిన వివరాల ప్రకారం రాఫెల్స్ ఆసుపత్రికి వచ్చిన ఒక పురుష సందర్శకుడిని శివ నాగు లైంగిక వేధింపులకు గురిచేశాడు. బాధితుని వయస్సు తదితర వివరాలను కోర్టు పత్రాలలో గోప్యంగా ఉంచారు. జూన్ 18న బాధితుడు నార్త్ బ్రిడ్జ్ రోడ్‌లోని రాఫెల్స్ ఆస్పత్రి వెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతున్న తన తాతను చూసేందుకు వచ్చాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూజీన్ ఫువా వివరించారు.
తరువాత ఏలిపె శివ నాగు ‘డిస్‌ఇన్‌ఫెక్ట్’ చేస్తానంటూ బాధితుని దగ్గరకు వెళ్లి, తన చేతికి సబ్బు రాసుకుని అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూజీన్ ఫువా కోర్టులో తెలిపారు. ఈ ఘటన తర్వాత బాధితుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు. జూన్ 18న ఈ ఘటన జరిగింది. జూన్ 21న బాధితుడు ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ నేపధ్యంలో పోలీసులు శివ నాగును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆస్పత్రి యాజమాన్యం ఏలిపె శివ నాగును నర్సింగ్ విధుల నుంచి సస్పెండ్ చేసింది.


