
రిజర్వేషన్ బోగీలో బెర్త్ పరిస్థితి ఇది.., రైలులో అందజేసిన నాసిరకం భోజనం,
రైల్వే సేవలపై దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఫిర్యాదులు
2023–24, 24–25లో దాదాపు 61 లక్షల ఫిర్యాదులు
2023–24తో పోలిస్తే 2024–25లో 11 శాతం పెరిగిన కంప్లైట్స్
ప్రతి 4 ఫిర్యాదుల్లో ఒకటి భద్రతపైనే..
గత ఏడాది రైలు ప్రయాణంలో భద్రతాలోపాలపై అత్యధికంగా 7.50 లక్షల ఫిర్యాదులు
కోచ్‌లలో అపరిశుభ్ర వాతావరణంపైనా పెదవి విరిచిన 8.44 లక్షల మంది
ట్రైన్ల సమయపాలనపై 15 శాతం తగ్గిన ఫిర్యాదులు
భారతీయ రైల్వే... దూర ప్రయాణానికి అత్యంత చవకైన, సౌకర్యవంతమైన మార్గం. అయితే కోవిడ్ అనంతర ఆర్థిక సంస్కరణల పేరుతో వృద్ధుల రాయితీలు సహా పలు రాయితీలను రద్దు చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ, ప్రయాణికులకు సేవలందించే విషయంలో మాత్రం అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోంది. రైలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా, వాటిని పరిష్కరించి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంలో రైల్వే బోర్డు అలసత్వం ప్రదర్శిస్తోంది.
సాక్షి, విశాఖపట్నం: రెండేళ్ల కాలంలో (2023–24, 2024–25) రైల్వే సేవలపై దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఏకంగా 60.96 లక్షలకు పైగా ఫిర్యాదులు చేశారు. ‘రైల్ మదద్’ హెల్ప్‌లైన్ (139), సోషల్ మీడియా, వెబ్‌సైట్ల ద్వారా ఈ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఫిర్యాదులలో అత్యధికంగా భద్రతా లోపాలపై ఉండటం గమనార్హం. గత వార్షిక సంవత్సరంలో (2024–25) భద్రతకు సంబంధించిన ఫిర్యా దులే ఏకంగా 7.50 లక్షల వరకు నమోదయ్యాయి. దీనికి అదనంగా రైళ్లలో పరిశుభ్రత లేమి, విద్యుత్ పరికరాల వైఫల్యాలు, ఆహారం నాణ్యతపైనా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అప్‌గ్రేడ్ ఒకవైపు.. లోపాలు మరొకవైపు
దేశంలో వందే భారత్, అమృత్ భారత్ వంటి అత్యాధునిక రైళ్లను ప్రవేశపెడుతూ రైల్వే శాఖ అప్‌గ్రేడ్ అవుతున్నా, రైలు ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకూ ప్రయాణికులకు అందించే ప్రాథమిక సేవలైన సీటింగ్, శుభ్రత, నాణ్యమైన ఆహారం విషయంలో మాత్రం లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారం నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నా వాటికి సరైన విధంగా స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాయితీలను రద్దు చేసి, ఆదాయాన్ని పెంచుకున్న రైల్వే శాఖ, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, వారి ఫిర్యాదులను పరిష్కరించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆహారమంటే.. ఆమడ దూరం.!
రైల్వేలలో నాణ్యత లేని ఆహారం వడ్డించారనే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. అయినా ఆహారం అందిస్తున్న కాంట్రాక్టు సంస్థలపై చర్యలు మాత్రం.. నామమాత్రంగానే తీసుకుంటున్నారు. ప్రయాణికులకు అవసరమైన శుచి, రుచికరమైన ఆహారం అందించాలన్నదానిపై మాత్రం రైల్వే మంత్రిత్వ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. 2020–21లో 253 ఫిర్యాదులు మాత్రమే అందగా, 2021–22లో 1082కి పెరిగింది. ఫిర్యాదుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూవస్తోంది. 2022–23లో 4421 ఫిర్యాదులు నమోదు కాగా, 2023–24లో 7026, 2024–25లో 6645కి చేరుకుంది.
గత ఐదేళ్లలో ఒక్క ఫిర్యాదుకే తీవ్రంగా స్పందించిన రైల్వే శాఖ.. ఆహారం అందిస్తున్న కాంట్రాక్టు సంస్థ లైసెన్స్‌ని రద్దు చేసింది. 3137 ఫిర్యాదులకు జరిమానాలు విధించగా.. 9627 ఫిర్యాదుల్ని పరిగణనలోకి తీసుకొని సదరు కాంట్రాక్టు సంస్థలకు హెచ్చరికలతో సరిపెట్టింది. ట్రైన్లలో ఆహారం అందించేందుకు దేశ వ్యాప్తంగా 20 సంస్థలతో రైల్వే బోర్డు ఒప్పందాలు కుదుర్చుకుంది. అయినా కఠిన చర్యలు తీసుకోవడంలో మాత్రం రైల్వే మంత్రిత్వ శాఖ మీనమేషాలు లెక్కిస్తూ నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్న సంస్థలపై కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
భద్రత శూన్యం.. శుభ్రత మృగ్యం
2023–24లో రైల్వే సేవల్లోని అన్ని ఫిర్యాదులు కలిపి 28.96 లక్షలు వచ్చాయి. 2024–25 సంవత్సరంలో ఏకంగా 11 శాతానికిపైగా పెరిగి 32 లక్షలకు చేరుకుందంటే.. లోపం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైల్వే ప్రయాణంలో భద్రత అనేది ప్రయాణికులకు అతి పెద్ద సమస్యగా మారిందని ఫిర్యాదుల ద్వారా అవగతమవుతోంది. రైళ్లలో భద్రతకు సంబంధించిన ఫిర్యాదులు గతేడాదితో పోలిస్తే.. 64 శాతం వరకూ పెరిగాయి. 2023–24లో 4.57 లక్షల ఫిర్యాదులు భద్రతకు సంబంధించి కాగా.. 2024–25లో 7.50 లక్షలకు చేరుకోవడం బాధాకరం.
ప్రతి నాలుగు ఫిర్యాదుల్లో ఒకటి భద్రతకు సంబంధించింది ఉండటం చూస్తే.. రైలు ప్రయాణికులు ఎంతలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో స్పష్టమవుతోంది. అదేవిధంగా.. తర్వాత లోపం.. కోచ్‌లలో పరిశుభ్రత కరువవ్వడం. ఏడాది కాలంలో వచ్చిన ఫిర్యాదుల్లో కోచ్‌లలో అపరిశుభ్ర వాతావరణంపై 16.5శాతం వరకూ ఉంటున్నాయి. గతేడాదిలో ఏకంగా 8.44 లక్షల ఫిర్యాదులు అందాయి.
విద్యుత్ పరికరాల వైఫల్యాలపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. సమయపాలన గురించి ఫిర్యాదులపై 15 శాతం వరకూ తగ్గడం కాస్తా ఉపశమనం. 2023–24లో సమయపాలనపై 3.25 లక్షల కంప్‌లైంట్స్ రాగా.. 2024–25లో 2.77 లక్షలకు తగ్గడం విశేషం. రైల్వే స్టేషన్ల స్థాయి ఫిర్యాదులు కూడా తగ్గుముఖం పట్టాయి. 2023–24లో స్టేషన్ స్థాయి ఫిర్యాదులు 5.55 లక్షలు రాగా.. 2024–25లో 4.39 లక్షలకు తగ్గాయి.
⇒ 2023–24లో రైలు సేవలపై ఫిర్యాదులు– 28.96 లక్షలు
⇒ 2024–25లో ఫిర్యాదులు 32 లక్షలు
⇒ భద్రతపై 2024–25లో వచ్చిన ఫిర్యాదులు– 7.50 లక్షలు
⇒ అపరిశుభ్రవాతావరణంపై వచ్చిన ఫిర్యాదులు– 8.44 లక్షలు
⇒ సమయపాలనపై 2024–25లో వచ్చిన ఫిర్యాదులు– 2.77 లక్షలు
⇒ 2020–21లో ఆహారంపై వచ్చిన ఫిర్యాదులు– 253
⇒ 2024–25లో వచ్చిన ఫిర్యాదులు– 6,645