
ఈ రోజుల్లో బంగారం కేవలం అలంకారానికి ఉపయోగించే ఆభరణం కాదు. భవిష్యత్తు కోసం దాచుకునే ఓ పెట్టుబడి. ప్రస్తుతం గోల్డ్ రేట్లు రాకెట్‌లా దూసుకెళ్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో రూ. 78వేలు నుంచి రూ. 84వేలు మధ్య ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర నేడు.. రూ. లక్ష దాటేసింది. ఇంతలా ధరలు పెరగడానికి ద్రవ్యోల్బణం లేదా రిటైల్ డిమాండ్ వంటివి మాత్రమే కాకుండా.. మరో మూడు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి.
➤పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. యూఎస్ డాలర్ మీద తగ్గుతున్న నమ్మకం వంటివి బంగారం ధరలను అమాంతం పెంచేసాయి. అంతే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడంపై సుముఖత చూపుతున్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో మాత్రమే, కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు ఐదేళ్ల సగటు కంటే 24 శాతం ఎక్కువగా ఉన్నాయి. చైనా, పోలాండ్ వంటివి ఈ విషయంలో ఇతర దేశాల కంటే ముందు ఉన్నాయి.
➤బంగారం ధరలు పెరగడానికి.. ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణం. 2022లో 300 బిలియన్లకు పైగా రష్యన్ నిల్వలు స్తంభింపజేసినప్పుడు.. అనేక దేశాలు తమ డాలర్ విలువను పెంచుకోవచ్చని గ్రహించాయి. ఆ సమయంలో బంగారం ఒక భీమా పాలసీగా మారింది. కేంద్ర బ్యాంకు కొనుగోళ్లు ఇప్పుడు 1,000 టన్నులను మించిపోయాయి, ఇది దశాబ్ద సగటు కంటే రెట్టింపు అని తెలుస్తోంది.
ఇదీ చదవండి: రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
➤భారతదేశంలో గోల్డ్ ఇటీఎఫ్‌లలో పెట్టుబడులు భారీగా పెరిగాయి. పెట్టుబడిదారులు 2025 జూన్‌లో రూ. 2,000 కోట్లు, 2025 జూలైలో మరో రూ. 1,256 కోట్లకు పైగా ఈ నిధులలోకి ఇన్వెస్ట్ చేశారు. భారతీయులలో కూడా చాలామంది బంగారాన్ని కేవలం పండుగలకు మాత్రమే కాకుండా.. పొదుపు చేయడంలో భాగంగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.
ఈ రోజు బంగారం ధరలు ఇలా
సెప్టెంబర్ 09న భారతదేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 700 పెరిగి రూ. 98,650 వద్దకు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 760 పెరిగి రూ. 1,07,620 వద్ద నిలిచింది. నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు.. ఈ రోజు మళ్ళీ పెరిగిపోయింది.