
ఎస్సై సహా కుటుంబీకుల వేధింపులే కారణమని ఆరోపణ
ఆస్పత్రి మార్చురీ వద్ద భర్త తండ్రికి దేహశుద్ధి
జూలూరుపాడు/ఖమ్మం క్రైం: భర్త పోలీసు శాఖలో ఎస్సై, బావ కూడా అదే ఉద్యోగం.. మామ సైతం రిటైర్డ్ పోలీసు అధికారి. సమాజంలో ప్రజల కష్టాలు తీర్చే ఉద్యోగుల ఇంటికి కుమార్తెను ఇస్తే బిడ్డ జీవితం బాగుంటుందని భావిస్తే వివాహేతర సంబంధాల పేరిటే కాక రకరకాల కారణాలతో వేధిస్తుండడంతో ఆమె తనువు చాలించింది.
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాములుతండాకు చెందిన బానోతు రాణాప్రతాప్‌తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన రాజేశ్వరి(34)కి 2018లో వివాహం జరిగింది. ఆ సమయాన రూ.40 లక్షలతో పాటు, 35 తులాల బంగారం, మరో రూ.4లక్షల విలువైన కానుకలను ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉండగా.. కొన్నాళ్ల నుంచి భర్తతో పాటు అత్తామామలు పుష్పరాణి – చంద్రం, బావ మహేష్ (ఎస్సై, మహబూబాబాద్ వీఆర్) రాజేశ్వరికి వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తున్నట్లు సమాచారం. కాగా, రాణాప్రతాప్‌కు ఖమ్మం జీఆర్పీ ఎస్సైగా పోస్టింగ్ రావడంతో భార్యాపిల్లలను జూలూరుపాడులోనే ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు. అయితే, కుటుంబీకుల వేధింపులు తాళలేక రాజేశ్వరి జూలూరుపాడులోని అద్దె ఇంట్లో జూన్ 25న పురుగుల మందు తాగగా ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం, ఆపై హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి మృతి చెందింది.
మామపై దాడి..
హైదరాబాద్ నుంచి రాజేశ్వరి మృతదేహాన్ని సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈక్రమాన రాణాప్రతాప్ తండ్రి చంద్రయ్య మార్చురీ వద్దకు రావడంతో తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తూ రాజేశ్వరి కుటుంబీకులు దాడి చేశారు. దీంతో జూలూరుపాడు, ఖమ్మం టూటౌన్ పోలీసులు అడ్డుకుని ఆయనను టూటౌన్‌కు తరలించారు. ఘటనపై మృతురాలు తండ్రి సోమ్లా ఫిర్యాదుతో రాణాప్రతాప్, పుష్పరాణి, చంద్రం, మహేష్‌పై కేసు నమోదు చేసినట్లు జూలూరుపాడు ఎస్‌ఐ రవి తెలిపారు. కాగా, రాణాప్రతాప్, ఆయన సోదరుడు మహేష్ మొదటి నుంచీ వివాదాస్పదులుగానే ఉన్నారు. ఖమ్మం పాత బస్టాండ్ సమీపాన ఓ చెప్పుల షాపు యజమానిపై కొన్నాళ్ల క్రితం అకారణంగా దాడి చేసిన రాణాప్రతాప్ తుపాకీతో బెదిరించాడు. ప్రస్తుతం ఆయన భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిసింది.