
‘‘ఓ నిర్మాతకు ఓ హీరోతో సినిమా కమిట్‌మెంట్ కావాలంటే అబ్‌నార్మల్ అడ్వాన్స్‌లు ఇచ్చి, వాళ్లను హోల్డ్ చేసుకుని సినిమా ప్లాన్ చేయాలి. అది నా ఫార్ములా కాదు. హీరోలకు, దర్శకులకు అడ్వాన్స్‌ల రూపంలో డబ్బులిచ్చి, వారిని కట్టడి చేయడం అనే దానికి నేను వ్యతిరేకం. ఓ దర్శకుడితో నాకు వేవ్ లెంగ్త్ సింక్ అయితే సినిమా చేస్తాను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమీ గౌడ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు పంచుకున్న విశేషాలు.
→ కథగా చూస్తే ‘తమ్ముడు’ సింపుల్ స్టోరీ. అక్కా తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, వారు ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు? అనేది మూవీలో చూస్తారు. స్క్రీన్‌ప్లే పరంగా కొత్తగా చూపిస్తూ, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆసక్తికరంగా తీశాడు వేణు శ్రీరామ్. ఇది యాక్షన్ ప్యాక్డ్ సినిమా. మొదటి ఇరవై నిమిషాల తర్వాత ఈ సినిమాలోని మిగిలిన కథంతా ఒక్క రోజులో జరుగుతుంది.
→ మా బ్యానర్‌లోని గత సినిమాలు అమెజాన్‌లో స్ట్రీమింగ్ అయ్యాయి. కానీ ఒకరితోనే ముందుకు వెళ్లలేం కదా. సో... ‘తమ్ముడు’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్‌లో సినిమా ప్రదర్శనకు ముందు ఆ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో తెలిసేలా ఉండటం కరెక్ట్ కాదు. ఈ విషయం గురించి ఓటీటీ సంస్థలతో మాట్లాడినప్పుడు సపోర్ట్ చేస్తామన్నారు.
→ ఎఫ్‌డీసీ నుంచి గద్దర్ అవార్డ్స్ వేడుక చేశాం. అలాగే మన హైదరాబాద్‌లో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ఈ ఏడాది ఎఫ్‌డీసీ ద్వారా నిర్వహించాలని అనుకుంటున్నాం. ఆన్‌లైన్ టికెటింగ్, రన్‌ట్రాక్ (సినిమా వసూళ్లను ట్రాక్ చేసే విధానం) లను తెలంగాణాలో తీసుకువచ్చే ప్రక్రియ కొనసాగుతోంది.
→ మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థల్లో ఈ ఏడాది నాలుగు సినిమాలు (రౌడీ జనార్థన, ఎల్లమ్మ, దేత్తడి, మరో సినిమా స్క్రిప్ట్ స్టేజ్‌లో ఉంది) రెడీ అవుతున్నాయి. ఇంకా అనిల్ రావిపూడితో ఓ సినిమా, ‘మార్కో’ హనీఫ్‌తో ఓ సినిమా, ఓ ఇద్దరు కొత్త డైరెక్టర్స్ సినిమాలు ఉన్నాయి. ఇంకా ఓ అడ్వెంచరస్ సినిమా కూడా ఉంది. ప్రశాంత్ నీల్‌తో సినిమా ఉంటుంది. హోల్డ్‌లో ఉన్న ‘సెల్ఫిష్’ సినిమాపై ఈ వారంలో ఓ కార్లిటీ వస్తుంది. కొత్తవారిని ప్రోత్సహించే విధంగా ‘దిల్’ రాజు డ్రీమ్స్‌లో కొన్ని ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి.
‘దిల్’ రాజు డ్రీమ్స్‌లో నిర్మాతలు కూడా దరఖాస్తు చేసు కుంటున్నారు. కథ బాగుంటే మేమే బడ్జెట్ కేటాయించి వాళ్లతో సినిమా చేస్తాం. వాళ్లు సినిమా చేసుకుని మా దగ్గరకు వస్తే మా గైడెన్స్‌తో ఆ సినిమాను రిలీజ్ చేస్తాం. ఇక పైరసీని అరికట్టేందుకు ఇండస్ట్రీ నుంచి గట్టి చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ‘కుబేర, కన్నప్ప’ చిత్రాల పైరసీ ప్రభావం కాస్త తగ్గింది
→ ‘గేమ్ చేంజర్’ చిత్రా నికి నిర్మాత మీరేనా? జీ స్టూడియోస్ సంస్థనా? జీ స్టూడియోస్ తమ సినిమా అంటున్నారట? అనే ప్రశ్నకు– ‘‘ఒకవేళ వాళ్లే అయితే లాస్ కట్టమనాలి’’ అని ‘దిల్’ రాజు బదులిచ్చారు.
అవమానపరచాలనుకోలేదు: నిర్మాత శిరీష్
‘‘మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తో చిరంజీవి, రామ్‌చరణ్‌గారికి ఎంతో అనుబంధం ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్‌చరణ్‌గారు ఒకరు. ఆయన్ని అవమానపరచడం, కించపరచడం చేయను. అది జరిగిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు కాబట్టి వాళ్లకు, చరణ్‌గారికి క్షమాపణలు చెబుతున్నాను. మా బ్యానర్‌లో చరణ్‌గారితోనే మరో సినిమా చేయబోతున్నాం’’ అంటూ శిరీష్ ఓ వీడియో బైట్ రిలీజ్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ తర్వాత ఆ చిత్రదర్శకుడు శంకర్, హీరో రామ్‌చరణ్ కనీసం ఫోన్ కూడా చేయలేదన్నట్లుగా శిరీష్ పేర్కొన్నారు. ఆ తర్వాత నెలకొన్న వివాదంపై తన స్పందనను ఇలా వీడియో బైట్ ద్వారా తెలియజేశారు.