
న్యూఢిల్లీ: పశ్చిమ ఆఫ్రికా దేశంలోని వివిధ ప్రాంతాలలో వరుస ఉగ్రవాద దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే నేపధ్యంలో మాలిలో ముగ్గురు భారతీయులను ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అపహరించింది. దీనిపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేస్తూ, మాలి ప్రభుత్వం ఆ ముగ్గురు భారతీయుల సురక్షితమైన విడుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
మాలిలోని కేస్‌లోగల డైమండ్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఆ ముగ్గురు భారతీయులు పనిచేస్తున్నారు. వీరి కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. జూలై ఒకటిన సాయుధ దుండగుల బృందం ఫ్యాక్టరీ ప్రాంగణంలో దాడి చేసి, ముగ్గురు భారతీయులను బందీలుగా తమ వెంట తీసుకువెళ్లిందని ఎంఈఏ తెలిపింది.
అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (జేఎన్‌ఐఎం)మాలి అంతటా జరిగిన దాడులకు బాధ్యత వహించింది. బమాకోలోని భారత రాయబార కార్యాలయ అధికారులు ఆ ముగ్గురు భారతీయుల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఈ హింసాత్మక చర్యను భారత ప్రభుత్వం ఖండిస్తోందని, అపహరణకు గురైన భారత పౌరులను సురక్షితంగా విడుదల చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని మాలి రిపబ్లిక్ ప్రభుత్వాన్ని ఎంఈఏ కోరింది. మాలిలోని భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని,అవసరమైన సహాయం కోసం బమాకోలోని రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలని ఎంఈఏ సూచించింది.
ఇది కూడా చదవండి: విమాన ప్రమాద పరిస్థితులపై ‘రీక్రియేషన్’.. ఏం తేలిందంటే..