
కళ్లకు గంతలు కట్టి.. గొంతులో కత్తితో పొడిచి తండ్రిని హతమార్చిన కుమారుడు
బెట్టింగ్ డబ్బులపై ప్రశ్నించినందుకే దారుణం
ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం
పోలీసుల విచారణలో హత్య చేసినట్లు ఒప్పుకున్న కొడుకు
హైదరాబాద్: తండ్రిని సర్‌ప్రైజ్ చేస్తానని చెప్పిన ఓ కుమారుడు.. కళ్లకు గంతలు కట్టి.. ఆపై కత్తితో పొడిచి హతమార్చిన వైనం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టిన డబ్బుల గురించి తండ్రి అడగడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఘన్‌పూర్ మండలం కోతులకుంటకు చెందిన కెతావత్ హన్మంత్ (37) బతుకుదెరువు కోసం గోపన్‌పల్లి ఎన్‌టీఆర్ నగర్‌కు వలస వచ్చి మేస్త్రీగా పనిచేస్తున్నాడు.
ఆయనకు భార్య జములమ్మ, కొడుకులు రవీందర్ (19), సంతోషిలు ఉన్నారు. హన్మంత్ ఇటీవల తన భూమిని కుదువబెట్టి రూ.6 లక్షల అప్పు తీసుకొని ఇంట్లో పెట్టాడు. ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కొడుకు కెతావత్ రవీందర్ యాప్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి రెండున్నర లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్‌లో పోగొట్టాడు. తండ్రి పదేపదే డబ్బుల గురించి అడగగా.. అవసరానికి స్నేహితునికి ఇచ్చానని త్వరలోనే తిరిగిస్తాడని నమ్మబలికాడు. దీంతో రోజూ ఇంట్లో డబ్బు గురించి గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో రవీందర్ తన స్నేహితుడు డబ్బులు ఇచ్చేందుకు వస్తున్నాడని మంగళవారం తండ్రిని ఎన్‌టీఆర్ నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
నీకు మంచి సర్‌ప్రైజ్ ఇస్తానని నమ్మించి తండ్రి కళ్లకు గంతలు కట్టాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన కత్తితో గొంతులో బలంగా పొడిచాడు. దాదాపు 100 మీటర్ల వరకు పరిగెత్తి కింద పడిపోయి హన్మంత్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అనంతరం రవీందర్ బాబాయ్ రమేశ్‌కు ఫోన్ చేసి నాన్న కత్తితో పొడుచుకొని చనిపోయాడని చెప్పాడు. ఆత్మహత్యగా కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కోతులకుంటకు తరలించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘనపూర్ పీఎస్‌కు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలు నిర్వహిస్తే అందరిపై కేసు నమోదవుతుందని హెచ్చరించి, మంగళవారం రాత్రి హన్మంత్ మృతదేహాన్ని తిరిగి గచ్చిబౌలి పీఎస్‌కు తీసుకొచ్చారు. మృతదేహంతో పాటు వచ్చిన రవీందర్‌ను విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.