
అమెరికాలోని న్యూయార్క్ మేయర్ (New York Mayor) అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. న్యూయార్క్‌లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వానికి జరిగిన పోరులో భారత సంతతి వ్యక్తి జోహ్రాన్ మమదానీ (Zohran Mamdani) గెలుపొందారు. మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఆయన విజయం సాధించారు.
ప్రైమరీ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థులెవరికీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో ర్యాంక్డ్ ఛాయిస్ కౌంట్ ద్వారా అభ్యర్థిత్వ రేసు ఫలితాన్ని వెల్లడించగా జోహ్రాన్ మమదానీ గెలుపొందారు. ప్రస్తుత న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయనున్నారు. ఇంతకు ముందు.. డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆయన పలు అవినీతి కుంభకోణాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో న్యూయార్క్ ప్రజల నుంచి ఎరిక్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
నవంబర్‌లో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల రేసులో జోహ్రాన్ మమదానీ ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్‌తో తలపడాల్సి ఉంటుంది. ఒకవేళ జోహ్రాన్ మేయర్‌గా ఎన్నికైతే.. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మొదటి ముస్లిం, భారతీయ-అమెరికన్‌గా చరిత్ర సృష్టిస్తారు.
మేయర్ ఎన్నిక ప్రధాన అభ్యర్థులు(ఇప్పటివరకు)
- జోహ్రాన్ మమదానీ (Zohran Mamdani) – డెమోక్రటిక్ సోషలిస్ట్, డెమోక్రటిక్ ప్రైమరీలో విజయం
- కర్టిస్ స్లివా (Curtis Sliwa) – రిపబ్లికన్ అభ్యర్థి
- జిమ్ వాల్డెన్ (Jim Walden) – స్వతంత్ర అభ్యర్థి
- ఎరిక్ అడమ్స్ – ప్రస్తుత మేయర్, స్వతంత్ర అభ్యర్థి
జోహ్రాన్ మమదానీ గురించి.. 33 ఏళ్ల రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య రమా దువాజీ(rama duwaji). ఓ డేటింగ్ యాప్‌తో పరిచయమై.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు.


ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడీయన. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. బెర్నీ సాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. జోహ్రాన్ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు.
Billionaires ke paas already sab kuchh hai. Ab, aapka time aageya.
Billionaires already have everything. Now, your time has come. pic.twitter.com/bJcgxzt37S— Zohran Kwame Mamdani (@ZohranKMamdani) June 4, 2025