విమర్శల జడివానలో మమ్దానీ  | Mamdani faces barrage of Islamophobic attacks after New York primary success | Sakshi
Sakshi News home page

విమర్శల జడివానలో మమ్దానీ 

Jun 27 2025 5:16 AM | Updated on Jun 27 2025 5:22 AM

Mamdani faces barrage of Islamophobic attacks after New York primary success

పాలస్తీనా అనుకూల వైఖరి 

ఇజ్రాయెల్‌ వ్యతిరేక ధోరణి 

హిందూత్వంపై అక్కసు 

అమెరికా విదేశాంగ విధానాలపై తరచూ విమర్శలు 

దాంతో అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు

అన్ని వర్గాల నుంచి విమర్శల బాణాలు గుచ్చుకుంటున్నా గెలుపే లక్ష్యంగా సాగిపోతున్న మమ్దానీ వైఖరిపై ఇప్పుడు న్యూయార్క్‌ నగరవ్యాప్తంగా చర్చకొనసాగుతోంది. పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్‌ వ్యతిరేక వైఖరితో వార్తల్లోనేకాదు న్యూయార్క్‌ సిటీ మేయర్‌ ఎన్నికల్లోనూ నిలిచి డెమొక్రటిక్‌ అభ్యరి్థత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్‌ ఖ్వామీ మమ్దానీని భారత్‌లోనూ పెద్దసంఖ్యలో ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీ, హిందూయిజం, భారత ప్రభుత్వ పాలనా విధానాలపైనా మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్వీట్లే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తరచూ అబద్దాలు వల్లెవేస్తూ అందలానికి ఎక్కాలని చూసే పూర్తి అవకాశవాది అనే ఆరోపణలూ పెరిగాయి. 

మొదట్నుంచీ అతి వాగ్దానాలు 
డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అభ్యరి్థత్వాన్ని గెల్చుకున్న వెంటనే మమ్దానీని ‘నెరవేరని వాగ్దానాలుచేసే నేత’గా ప్రస్తుత న్యూయార్క్‌ మేయర్‌ ఎరిక్‌ ఆడమ్స్‌ అభివర్ణించారు. ‘‘ఎలాంటి వాగ్దానాలు చేస్తే జనం మెచ్చుతారో మమ్దానీ అచ్చు అలాగే మాట్లాడతారు. నెరవేర్చడం అసాధ్యం అని తెల్సికూడా ఇష్టమొచి్చన హామీలిస్తాడు’’అని ఎరిక్‌ ఆరోపించారు. ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మమ్దానీని ఓడిస్తానని ఎరిక్‌ ప్రతిజ్ఞచేశారు. ‘‘అపార్ట్‌మెంట్లలో అద్దెలను క్రమబద్దీకరిస్తానని, అవసరమైతే భారీగా తగ్గేలా చేస్తానని మమ్దానీ హామీ ఇచ్చాడు. ప్రజాధనంతో ప్రజలందరికీ ఉచిత బస్సు, శిశుసంరక్షణ కార్యక్రమాలు చేపడతానని చెప్పాడు. 

నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సరకు దుకాణాలు తెరుస్తానన్నాడు. తన వాగ్దానాలు నెరవేర్చేందుకు ఏకంగా 10 బిలియర్‌ డాలర్లు ఖర్చువుతుందని ప్రకటించారు. ఇందుకు కావాల్సిన నగదు మొత్తాలను న్యూయార్క్‌ నగరంలోని సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తల నుంచి పన్నుల రూపంలో ముక్కు పిండిమరీ వసూలుచేస్తానన్నాడు. అయితే నగరంలో పన్నులు వసూలుచేసే అధికారం మేయర్‌కు ఉండదన్న కనీస అవగాహన మమ్దానీకి లేదు’’అని ఆడమ్స్‌ గుర్తుచేశారు. మమ్దానీ ప్రస్తుతం క్వీన్స్‌ 36వ జిల్లా నుంచి న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నారు.  

పాలస్తీనాకు జై.. నెతన్యాహూకు నై 
పాలస్తీనియన్ల హక్కులను పరిరక్షించాలని తరచూ మమ్దానీ ప్రసంగాలిస్తుంటారు. గాజాలోని హమాస్‌పై ఇజ్రాయెల్‌ సేనల భీకర దాడులను ఈయన తీవ్రంగా తప్పుబట్టారు. దాడులకు ఆదేశించిన ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ యుద్ధనేరాలకు పాల్పడిన నేరస్తుడిగా మమ్దానీ అభివరి్ణంచారు. ‘‘యుద్దనేరస్తుడిగా అంతర్జాతీయ నేర న్యాయస్థానం నెతన్యాహూపై 2024 నవంబర్‌లోనే అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. అతను న్యూయార్క్‌కు వస్తే ఖైదు చేసి బందీఖానాలో పడేస్తా’’అని మమ్దానీ గతంలో చేసిన వ్యాఖ్యలపై అమెరికాలోని యూదు సంఘాలు ఒంటికాలిపై లేచి ఆగ్రహం వ్యక్తంచేశాయి.  

మోదీపైనా విమర్శలు 
గుజరాత్‌ అల్లర్లలో ఎంతో మంది ముస్లింలు చనిపోయారని, అందుకు నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీయే కారణమని మమ్దానీ గత నెలలో ఆరోపించారు. అమెరికాలో ఏదైనా వేడుకలో మోదీతో కలిసి మీరు వేదికను పంచుకుంటారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు మమ్దానీ పైవిధంగా సమాధానమిచ్చారు. ‘‘నెతన్యాహూ మాదిరే మోదీ కూడా యుద్దనేరస్తుడే. 

గుజరాత్‌లో ఎంతో మంది ముస్లింల మరణాలకు మోదీ కూడా కారణమే. అందరూ చనిపోగా గుజరాత్‌లో మచ్చుకైనా మనం మిగిలిపోతామ ని ఒక్క ముస్లిం కూడా భావించి ఉండడు’’ అని అన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీతోపాటు కాంగ్రెస్‌ నేతలూ తీవ్ర అభ్యంతరంవ్యక్తంచేశారు. ‘‘మమ్దానీ ఒక్కసారి నోరు తెరిచాడంటే తమకింక పనిలేదని పాకిస్తాన్‌లోని తప్పుడు ప్రచార బృందాలు కూడా సెలవు పెట్టి ఇంటికి వెళ్లిపోతాయి. ఆ స్థాయిలో భారత్‌పై విద్వేషం చిమ్ముతాడు. న్యూయార్క్‌ నుంచి ఊహాత్మక అబద్దాలు అల్లే ఇతగాడు ఉండగా మనకు వేరే శత్రువు అక్కర్లేదు’’అని కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ వ్యాఖ్యానించారు.

 నగరంలో మమ్దానీకి మద్దతుదారులు పెరిగితే చివరకు ‘జిహాదీ మేయర్‌’అవతరిస్తాడు అని ఒక నెటిజన్‌ ఆగ్రహం వ్యక్తంచేశాడు. మమ్దానీని విమర్శించే వాళ్లు అతని తల్లిదండ్రులపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘మమ్దానీ తండ్రి అసలైన మార్కిస్ట్‌కాదు. నిఖార్సయిన వ్యక్తికాదు. ఇక అతని తల్లి మీరా నాయర్‌ అసలైన కేరళ మలయాళీ నాయర్‌ కాదు. ఆమె పేరులో అక్షరదోషం ఉంది. ఆ పేరు నాయర్‌ కాదు పంజాబీ నయ్యర్‌. మమ్దానీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఇతని హిందువులన్నీ, యూదులన్నీ అస్సలు పడదు. వీళ్లపై జరిగే దాడులను సమర్థిస్తాడు’’అని మరో నెటిజన్‌ విమర్శించాడు. 

హిందూ వ్యతిరేకి? 
2020 ఆగస్ట్‌లో న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌ కూడలి వద్ద రామమందిర వేడుకలను నిరసిస్తూ జరిగిన ఒక హిందూ వ్యతిరేక ర్యాలీలో మమ్దానీ పాల్గొన్నట్లు ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జిహాదీ, ఖలిస్తాన్‌ వేర్పాటువాదులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీరాముడిని, హిందువులనుద్దేశిస్తూ మమ్దానీ అసభ్య పదజాలాన్ని వాడారు. గతంలో బీజేపీకి వ్యతిరేక పోస్ట్‌లు పెట్టారు. ‘‘భారత్‌లో బీజేపీ కేవలం హిందుత్వాన్నే ప్రోత్సహిస్తోంది. మన హిందూ ముత్తాతలు ఉర్దూ కవితలను ఇష్టపడితే, ముస్లిం పెద్దలు ఎంతో శ్రద్ధతో గుజరాతీలో భజనలు చేశారు. ఇలాంటి ఘన చరితను బీజేపీ తుడిచిపారేస్తోంది’’అని మమ్దానీ గతంలో ఒక ట్వీట్‌చేశారు. 

‘‘ఉగాండాలో ఉన్న మా కుటుంబాన్ని మేం భారతీయులనే కారణంతో వెలివేశారు. ముస్లింలు అనే కారణంగా భారత్‌లో మా తోటి ముస్లింలను పీడిస్తున్నారు’’అని గతంలో మరో పోస్ట్‌ పెట్టారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి పూర్వపు ఫొటోను షేర్‌చేసి దానికి ఒక క్యాప్షన్‌ ఇచ్చారు. ‘‘ఇది 400 ఏళ్లపాటు నిలిచిన మసీదు. కానీ దీనిని బీజేపీ ప్రేరేపిత మతమూక 1992లో కూల్చేసింది. దీనికి గుర్తుగా టైమ్స్‌ స్క్వేర్‌ కూడలిలో హిందువులు పండగ చేసుకున్నారు’’అని మరో పోస్ట్‌ పెట్టారు. ఆధునిక నాగరికతకు నిలయమైన న్యూయార్క్‌కు అవకాశమొస్తే మేయర్‌గా సేవలందించాల్సిన నేత ఇలా వివక్షధోరణితో ఉంటే పాలన సవ్యంగా సాగడం కష్టమని పలువురు న్యూయార్క్‌వాసులు ఆందోళన వ్యక్తంచేశారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement
 
Advertisement
Advertisement