
ఇండియన్ కల్చర్‌లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్‌లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్‌వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్‌వాలా. అది కుడా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.
భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్‌లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్‌లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్‌ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "చెకర్స్‌లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు.
మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్‌పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్‌లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.
‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL
— Narendra Modi (@narendramodi) July 24, 2025
ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా..
భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రీల్‌ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్‌తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్‌తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు.
ఎవరీ అఖిల్ పటేల్?
భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్‌ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్‌కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్‌లోని హాంప్‌స్టెడ్‌లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్‌లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్‌మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశాడు.
చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?
చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్‌కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్‌లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్‌కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్.