
విదేశాల్లో భారతీయులపై దాడులు పెరిగిపోతున్న పరిస్థితులు చూస్తున్నదే. తాజాగా ఐర్లాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆరేళ్ల చిన్నారిపై తోటి పిల్లలు జాత్యాంహకారం ప్రదర్శించారు. ఆమెపై ఇష్టానుసారం దాడి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడి భారతీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ఐర్లాండ్ వాటర్‌ఫోర్డ్ నగరంలో ఆగస్టు 4వ తేదీన దారుణం జరిగింది. భారత సంతతికి చెందిన ఆరేళ్ల బాలికపై జాత్యంహకార దాడి జరిగింది. భారత్‌కు తిరిగి వెళ్లిపో అంటూ తోటి పిల్లల్లో కొందరు ఆమెపై ఈ దాడికి తెగబడడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె ప్రైవేట్ భాగాలను గాయపరిచినట్లు తల్లి మీడియాకు వివరించారు.
సోమవారం సాయంత్రం కిల్‌బర్రీ ప్రాంతంలోని తన నివాసం బయట నియా నవీన్(6) తోటి పిల్లలలో కలిసి ఆడుకుంటోంది. ఆ సమయంలో 12-14 ఏళ్ల వయసున్న పిల్లలు కొందరు బాలిక వద్దకు వచ్చారు. అప్పటిదాకా అక్కడే ఉన్న బాలిక తల్లి.. మరో బిడ్డకు పాలిచ్చేందుకు లోపలికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన ఆ బ్యాచ్ సదరు బాలికపై దాడికి తెగబడింది. ఆమె ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ.. సైకిల్‌తో ప్రైవేట్ భాగాలను గాయపరిచింది.
బాలిక కేకలు విని బయటకు పరిగెత్తుకొచ్చింది ఆ తల్లి. ఆ సమయంలో వాళ్లంతా పారిపోగా.. నడవలేని స్థితిలో బాలిక భయంతో వణికిపోతూ కనిపించింది. డర్టీ ఇండియన్.. గో బ్యాక్ టూ ఇండియా అంటూ వాళ్లు అసభ్య పదజాలం ప్రయోగిస్తూ ఆ బాలికను వారించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

తాను ఎనిమిదేళ్లుగా ఇక్కడ నర్సుగా పని చేస్తున్నానని, ఈ మధ్యే ఐర్లాండ్ పౌరసత్వం దక్కిందని బాలిక తల్లి అనుపా అచ్యుతన్ ‘ఐరీష్ మిర్రర్’ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘మేం అధికారికంగానే ఇక్కడ వచ్చి ఉంటున్నాం.. మంచి వృత్తుల్లో స్థిరపడ్డాం. కానీ, ఇక్కడ భారతీయులెవరికీ భద్రత లేకుండా పోయింది. చివరికి ఇంట్లోనూ భయంతోనే గడపాల్సి వస్తోంది. నా బిడ్డను నేను దాడి నుంచి రక్షించుకోలేకపోయా. ఆమె ఇక నుంచి మునుపటిలా సరదాగా ఆడుకోలేదని నేను భావిస్తున్నా’’ అని జరిగిన ఘటన గురించి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలిక తల్లి తెలిపింది. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పిల్లలపై కఠిన చర్యలు తీసుకోకుండా.. విషబీజాలను వాళ్ల మనసుల్లోంచి తొలగించేలా కౌన్సెలింగ్ ఇప్పించాలని ఆమె కోరుకుంటోంది.
ఐర్లాండ్‌లో భారతీయులపై జాత్యాంహకార దాడులు పెరిగిపోయాయి. గత జులై నుంచి ఇప్పటిదాకా ఐదు ఘటనలు చోటు చేసుకున్నాయి. కిందటి నెలలోనూ ఓ భారతీయుడిపై జాత్యహంకార దాడి జరిగింది. రాజధాని నగరం డబ్లిన్‌లోని టల్లాట్‌లో 40 ఏళ్ల వ్యక్తిని దుండగులు దుస్తులు విప్పించి హింసించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనను భారత రాయబారి ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక కౌన్సిలర్ బాధితుడిని పరామర్శించి, బాసటగా నిలిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు రెండు నెలల క్రితమే ఆ దేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. భారతీయులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఐర్లాండ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యి.. హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసింది.
Credits: irishmirror