
అమెరికాలో న్యూయార్క్‌కు చెందిన నలుగురు భారత సంతతి వృద్ధులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. వీరు కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు కూడా చేపట్టారు. వీరి ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే, చివరికి ఈ అదృశ్య ఘటన విషాదాన్ని మిగిల్చింది.
వెస్ట్ వర్జీనియాలోని ఓ ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని.. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు మార్షల్ కౌంటీ పోలీసులు తెలిపారు. మరణించినవారు ఒకే కుటుంబానికి చెందిన ఆశా దివాన్(85), కిశోర్ దివాన్ (89), శైలేష్ దివాన్ (86), గీతా దివాన్ (84)లుగా పోలీసులు గుర్తించారు. న్యూయార్క్‌లోని బఫెలో నుంచి వెస్ట్ వర్జీనియాలోని మార్షల్ కౌంటీలో ఉన్న ప్యాలెస్ ఆఫ్ గోల్డ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో బిగ్ వీలింగ్ క్రీక్ రోడ్డులో వీరి వాహనం అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కకు దూసుకుపోయింది. దీంతో ఈ ప్రమాదాన్ని ఎవ్వరూ గమనించలేకపోయారు.
జులై 29న అదృశ్యం కాగా, వీరి వాహనం ప్రమాదానికి గురైనట్లు నిన్న (ఆగస్టు 2) పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో ఆ నలుగురు మృతి చెందినట్లు పోలీసులు ద్రువీకరించారు. చివరిసారిగా జులై 29న వీరు పెన్సిల్వేనియాలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. క్రెడిట్ కార్డును కూడా చివరిసారి అక్కడే వాడినట్లు తెలిసింది. నలుగురి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు.. హెలికాప్టర్‌లను కూడా రంగంలోకి దించారు. చివరికి వారు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు నిర్థారించారు.