
బలమైన అకడమిక్ పాలసీలు, అనుకూలమైన వీసా విధానాలు, విస్తరిస్తున్న కెరియర్ అవకాశాలతో ఐర్లాండ్ భారతీయ విద్యార్థులను ఎంతో ఆకర్షిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది 40,400 మంది విదేశీ విద్యార్థులకు ఐర్లాండ్ స్వాగతం పలికింది. ఇది గత సంవత్సరం కంటే 15% పెరుగుదల నమోదు చేసింది. ఐడీపీ ఎడ్యుకేషన్ తెలిపిన వివరాల ప్రకారం 2024లో భారతదేశం నుంచి ఐర్లాండ్ వెళ్లే విద్యార్థినుల సంఖ్య గతంలో కంటే 60 శాతంపైగా పెరిగింది. ఈ గణనీయమైన పెరుగుదల విద్యార్థి-స్నేహపూర్వక, సురక్షితమైన, సమ్మిళిత వాతావరణాన్ని సూచిస్తుంది. ఆ దేశంపై విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి ఐరిష్ విద్యా నాణ్యతను మాత్రమే కాకుండా దాని క్రియాశీల విధానాలు, భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుండడాన్ని హైలైట్ చేస్తుంది.
ఎందుకంత ఆసక్తి?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ టెక్నాలజీ, గేమింగ్ వంటి అధిక వృద్ధి, ఆవిష్కరణ ఆధారిత పరిశ్రమలకు ప్రపంచ కేంద్రంగా ఐర్లాండ్ నిలుస్తుంది. గూగుల్, మెటా, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఫైజర్, స్ట్రిప్.. వంటి ప్రధాన బహుళజాతి కంపెనీల యూరోపియన్ ప్రధాన కార్యాలయాలకు ఐర్లాండ్‌లో స్థాపిస్తున్నారు. ప్రపంచంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత డైనమిక్ రంగాల్లో కెరియర్ అవకాశాల కోసం యువత ఈ దేశంవైపు చూస్తోంది.
మెరుగైన యూనివర్సిటీలు
ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో నిలుస్తున్న విశ్వవిద్యాలయాలు అకడమిక్ విద్యను బలోపేతం చేస్తున్నాయి. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐర్లాండ్ యూనివర్సిటీలు చోటు సంపాదిస్తున్నాయి. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఆరు ఐరిష్ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకోగా, ట్రినిటీ కాలేజ్ డబ్లిన్ 75వ స్థానంలో నిలిచింది.
ట్రినిటీ కాలేజ్ డబ్లిన్: #75
యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్: #118
యూనివర్శిటీ ఆఫ్ గాల్వే: #289
యూనివర్శిటీ కాలేజ్ కార్క్: #292
డబ్లిన్ సిటీ యూనివర్శిటీ, యూనివర్సిటీ ఆఫ్ లిమెరిక్: 436వ స్థానంలో నిలిచాయి.
ఈ సంస్థలు ముఖ్యంగా డేటా సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, బిజినెస్ అనలిటిక్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో ప్రోగ్రామ్‌లకు ప్రసిద్ధి చెందాయి. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఇది గమ్యస్థానంగా తోస్తుంది. యూకే, ఆస్ట్రేలియాతో పోలిస్తే ఐర్లాండ్‌లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉంటాయని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేట్, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లకు ఇది ఎంతో ఉపయోగడుతుంది.
విద్య తర్వాత పని అవకాశాలు
ఐర్లాండ్ పోస్ట్ స్టడీ వర్క్ పాలసీ విదేశీ విద్యార్థులను మరింత ఆకర్షిస్తోంది. 2023లో 7,000 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాలు పొందారు. థర్డ్ లెవల్ గ్రాడ్యుయేట్ స్కీమ్ కింద, అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత రెండు సంవత్సరాల వరకు ఐర్లాండ్‌లో ఉండి పనిచేయవచ్చు. ఇది అంతర్జాతీయ పని అనుభవాన్ని పొందడానికి తోడ్పడుతుంది. విద్యార్థులు అకడమిక్ పరంగా వారానికి 20 గంటలు, సెలవు దినాల్లో 40 గంటలు పనిచేయడానికి అనుమతులున్నాయి. ఇది వారి అకడమిక్ సమయంలో ఆర్థికంగా సహాయపడుతుంది.
భారతదేశంతో సంబంధాలు బలోపేతం
ఐర్లాండ్-భారతదేశంలో విద్యార్థులు పెరుగుతున్న నేపథ్యంలో పరస్పరం విద్యా సహకారాలను పంచుకుంటున్నాయి. మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ (ఎంఓయూ), సంయుక్త పరిశోధన కార్యక్రమాలతో సహా 30కి పైగా సంస్థాగత భాగస్వామ్యాలు ఇప్పటికే కుదుర్చుకున్నాయి. ఐర్లాండ్-ఇండియా ఎఫినిటీ డయాస్పోరా నెట్వర్క్ విద్యా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. ఇది ఐర్లాండ్‌లోని భారతీయ విద్యార్థులకు సహాయక వ్యవస్థను అందిస్తోంది. ‘గ్లోబల్ సిటిజన్స్ 2030 ఇంటర్నేషనల్ టాలెంట్ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజీ’ వంటి జాతీయ వ్యూహాల ద్వారా అంతర్జాతీయ విద్య పట్ల ఐర్లాండ్ నిబద్ధతను హైలైట్ చేస్తుంది. అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, వృత్తి నిపుణులకు ఐర్లాండ్ మొదటి ఎంపికగా ఉంచాలనే ప్రభుత్వ దార్శనికతను ఈ ఫ్రేమ్‌వర్క్ ప్రతిబింబిస్తుంది.
ఇదీ చదవండి: బక్కచిక్కుతోన్న రూపాయి