
న్యూయార్క్: విమానం ల్యాండయిన 10 నిమిషాలకే ఎన్నారై పైలట్‌ను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన పైలట్‌ను శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.35 గంటల సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండవగా అధికారులు అందులోకి ఎక్కి పైలట్‌గా ఉన్న రుస్తొమ్ భగ్వాగర్(34)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.
పదేళ్లలోపు చిన్నారిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు నమోదైంది. తన తల్లితో డేటింగ్ చేసిన రుస్తొమ్ భగ్వాగర్ (Rustom Bhagwagar) తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆరేళ్లప్పుడు మొదలైన వేధింపులు తనకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగించాడని, ఈ విషయం తన తల్లికీ తెలుసునని ఆమె పేర్కొంది. ఆమె సమక్షంలోనూ ఇవి సాగాయని ఫిర్యాదు చేసిందని అధికారులు వెల్లడించారు.
కెనడా విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
ఒట్టావా: కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రాంతంలో చిన్న విమానం కూలిన ఘటనలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. డీర్ లేక్ సమీపంలో ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. డీర్ లేక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలింది.
చదవండి: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై అమానుషం
ఈ ఘటనలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి గౌతమ్ సంతోష్(27) ప్రాణాలు కోల్పోయారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో విమానం పైలట్ సైతం అక్కడికక్కడే చనిపోయారని పేర్కొంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని తెలిపింది.