
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని భారతసంతతికి చెందిన వ్యక్తిపై దుండగులు దాడి చేశాడు. సౌరభ్ ఆనంద్ (33) మందులు కొనుగోలు చేసి ఫార్మసీ నుండి ఇంటికి వెళుతుండగా, ఐదుగురు యువకులు కత్తితో దారుణంగా దాడి చేశారు. దీంతో అతనుతీవ్రంగా గాయపడ్డాడు.మెల్‌బోర్న్‌లో ఈ నెల(జూలై) 19న ఘటన చోటు చేసుకుంది. దీంతో భారతీయులపై వరుస జాత్యహంకార దాడులపై ఆందోళన వ్యక్తమవుతోంది.
జూలై 19న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆల్టోనా మెడోస్‌లోని సెంట్రల్ స్క్వేర్ షాపింగ్ సెంటర్‌లోని మందుల దుకాణంలో సౌరభ్ మందులు తీసుకున్నాడు. తన స్నేహితుడితో కాల్‌లో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఐదుగురు యువకులు అతన్ని చుట్టుముట్టి, చితకబాదారు. మరొకరు అతని తలపై నేలపై పడే వరకు కొట్టారు. మూడవ యువకుడు ఒక కత్తితో గొంతుకు పట్టుకుని దాడిచేయబోతే వెంటనే తన చేతిని రక్షణ కోసం పైకి లేపాడు. దీంతో అతని ఎడమ చేయి దాదాపు వేరుపడి పోయింది. ఒక చిన్న నూలుపోగు లాంటి నరం సాయంతా వేలాడుతూ ఉండింది. అతని భుజంపై, వీపుపై కూడా పొడిచారు. దీంతో వెన్నెముక విరిగింది ఇతర ఎముకలు కూడా విరిగిపోయాయి. తనను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, కత్తి నా మణికట్టుపై వేటు పడింది. రెండో కత్తిపోటు మరో చేతితి గుండా పోయింది. మూడవ దాడి ఎముక గుండా పోయిందనీ, నొప్పి మాత్రమే గుర్తుంది, నా చేయి దాదాపు వేరుపడిన స్థితిలో ఉంది అంటూ బాధితుడు ఆస్ట్రేలియన్ మీడియాతో తెలిపాడు.
చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన
తీవ్రగాయాలతో రక్తపు మడుగులతో పడి వున్న సౌరభ్ షాపింగ్ సెంటర్ బయటకొచ్చి సహాయాన్ని అర్థించాడు. దీంతో అతడిని సమీపంలోని రాయల్ మెల్‌బోర్న్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మొదట అతని చేతిని తీసివేయాల్సి వస్తుందని భావించారు. కానీ అదృష్టవశాత్తూ చేతిని తిరిగి అటాచ్ చేయగలిగారు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్లో ఐదుగురు యువకులలో నలుగురిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. మరొకరి కోసం గాలిస్తున్నారు. కాగా గత వారం ఆస్ట్రేలియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. కారు పార్కింగ్ వివాదంలో గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే భారతీయుడిపై దారుణంగా దాడి చేసి, జాతిపరంగా దుర్భాషలాడిన సంగతి తెలిసిందే.