
కలలు కంటూ కూర్చుంటే సరిపోదు. అనుకున్నట్టు ఎదగాలంటే పట్టుదల ఉండాలి. దానికి తగ్గ కృషి ఉండాలి. అందుకే కృషి ఉంటే మనుషులు మహాపురుషులౌతారు అంటాడో సినీ కవి. కర్ణాటకకు చెందిన రైతు లోహిత్ శెట్టి సక్సెస్ స్టోరీ వింటే మీరు కూడా ఔను అంటారు.
జీవితం అంటే ఐటీ కంపెనీల్లో లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేసే వ్యక్తులదేనా, నాది కూడా అని ఒక సామాన్య రైతుగా లోహిత్ శెట్టి నిరూపించిన వైనం ఇది. విలక్షణమైన సాగుతో, మార్కెట్ అవసరాలను అవగాహన చేసుకొని కోట్లు సంపాదిస్తున్నాడు కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల లోహిత్ శెట్టి పుట్టింది వ్యవసాయ కుటుంబం. 21 ఎకరాల భూమిలో రబ్బరు, కొబ్బరి, తమలపాకులు, జీడిపంటలు పండిస్తున్న తండ్రి, మేనమామలను చూస్తూ పెరిగాడు. అందరిలాగానే లోహిత్‌కు చాలా ఆశలు, ఆశయాలుండేవి. కానీ ఆర్థిక సమస్యల కారణంగా చదువును 10వ తరగతితోనే ఆపేయాల్సి వచ్చింది. అయినా నిరాశపడలేదు. ఉన్నచోటనే సక్సెస్‌ను వెదుక్కున్నాడు.
కుటుంబ కష్టాలు తీవ్రతరం కావటంతో తొలుత క్వారీలో చిన్న ఉద్యోగిగా పనిచేశాడు. దీని తర్వాత స్వగ్రామానికి దగ్గరలోనే ఉన్న ధర్మస్థలలోని ఒక పొలంలో 10 ఏళ్ల పాటు పని చేశాడు. అయితే లోహిత్‌కు వ్యవసాయంపట్ల ఉన్న మక్కువ అతణ్ని వ్యవసాయం వైపు మళ్లించింది. తొలుత తన కుటుంబ వారసత్వంగా వచ్చిన సాంప్రదాయ పంటలను సాగు చేసేవాడు. ఈ పంటల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది పైగా లాభదాయకంగా కూడా లేదని గమనించాడు. దీంతో కొంత పరిశోధన చేసి విదేశీ పండ్ల పెంపకంవైపు మళ్లి అద్భుతమైన విజయాన్ని సాధించాడు.
2006లో కేరళ నుండి రంబుటాన్ , మాంగోస్టీన్ మొక్కలను కొని దక్షిణ కన్నడ జిల్లాలోని తన పొలంలో నాటాడు. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఈ చెట్లు ఇప్పుడు సీజన్‌కు 80-100 కిలోల పండ్లను ఇస్తాయి. టోకు వ్యాపారులు వాటిని పొలం నుండి కిలోకు రూ.350 లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతుంది. రంబుటాన్, మాంగోస్టీన్ , డ్రాగన్ ఫ్రూట్ వంటి పండ్లను పండించడంలో ప్రత్యేకతను సాధించాడు. ప్రకృతిలో మమేకమై, మెళకువలను అర్థం చేసుకుంటూ భారీగా లాభాలను ఆర్జించాడు. వీటిని బెంగళూరు, చెన్నై , ముంబై వంటి ప్రధాన నగరాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఏడాదికి కోటి రూపాయట టర్నోవర్ సాధించాడు. తన లాంటి ఎందరో రైతులకు ప్రేరణగా నిలిచాడు.
చదవండి: 10 నెలల పాపను ఛాతీపై పడుకోబెట్టుకునే తండ్రికి వింత అనుభవం
అదనంగా 20 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని, పెద్ద ఎత్తున సాగుచేసి సక్సెస్ అయ్యాడు.. అంతేకాదు మొక్కలను ఉత్పత్తి చేయడానికి ఆయన ఒక నర్సరీని కూడా స్థాపించారు. దీని ద్వారా మరికొంత ఆదాయం లభించింది.

లోహిత్ విజయం, విజ్ఞానం కేవలం తన సొంత పొలానికే పరిమితం కాలేదు. ఆయన తన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని ఇతరులతో పంచుకుంటూ, తోటి రైతులకు వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడంలో సలహాలు సూచనలు అందిసతూ ముందుకు సాగుతున్నాడు. కృషి, వినూత్న విధానం, స్థిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల అంకితభావానికి లోహిత్ సక్సెస్ గొప్ప నిదర్శనం.
చదవండి: వాళ్లకి బ్రెయిన్ అవసరం లేదట : హర్ష్ గోయెంకా ట్వీట్ వైరల్
ప్రపంచంలోనే థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలు అతిపెద్ద రంబుటాన్ ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. 1980లలో మలేషియా, శ్రీలంక ద్వారా భారతదేశానికి చేరుకున్నట్లు చెబుతారు.