
బోనాల పండగ ఉత్సవాలతో దద్దరిల్లిన న్యూయార్క్
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో తెలంగాణ సంప్రదాయ బోనాల పండగ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రేటర్ న్యూయార్క్, న్యూజెర్సీ చుట్టుపక్కల స్థిరపడిన వందలాది తెలుగు ప్రవాస కుటుంబాలు ఒక్కచోట చేరి బోనాల జాతరను జరుపుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో జరిగిన ఈ పండగ అమెరికాలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను చాటింది.
ఇటు తెలంగాణలో ఆషాడ బోనాల సందడి మొదలుకాగానే, అటు అమెరికాలో ప్రవాసులు కూడా జాతర ఉత్సవాలకు సిద్దమయ్యారు. న్యూయార్క్‌లో స్థానిక ఐసన్ హోవర్ పార్కులో ఘనంగా బోనాల జాతర జరిగింది. ఆడపడుచులు, అమ్మాయిలు సంప్రదాయ దుస్తులతో స్వయంగా బోనాలను తయారుచేసి దేవతలకు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసంపదలతో మరింత అభివృద్ధి దిశగా పయనించాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని ప్రార్ధించారు. తెలంగాణ జానపద కళాకారులు జంగిరెడ్డి, దండుపల్లి శ్రీనివాస్ ల ఆటపాటలు నైటా బోనాలకు మరింత ఉత్సాహాన్ని నింపాయి, వాటి ఆటపాటలతో వేడుకల ప్రాంతం దద్దరిల్లింది. అలాగే అశోక్ చింతకుంట పోతురాజు వేషం వేయగా, వీరితో పాటు ఆహుతులు అందరూ కలిసి ఆడిపాడారు. ఆటపాటలతో పాటు చిన్నారులకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విజేతలకు బహుమతులు నైటా ఆధ్వర్యంలో అందించారు. అలాగే ఆహుతులందరికీ తెలంగాణ స్టయిల్లో పసందైన బోనాల విందును నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ వడ్డించింది.
న్యూయార్క్ మహానగరంలో నివసిస్తూ తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను నిలుపుకుంటున్న తెలుగు కుటుంబాలకు నైటా అధ్యక్షురాలు వాణి ఏనుగు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ విజయవంతానికి కృషి చేసిన నైటా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో పాటు, ప్రముఖ ఎన్ఆర్ఐ పైళ్ల మల్లారెడ్డి, వివిధ ఈవెంట్లను స్పాన్సర్ చేసిన సంస్థలు, వ్యక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.