
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూత వైద్యుడి అవతారమెత్తారు. సొంత ఆలోచనో.. ఎవరైనా సలహా ఇస్తున్నారో తెలియదు కానీ.. భూతాల భాష మాట్లాడి తన పరువు తానే తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రతిష్టనూ మసకబారుస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలోనే భూతాలు, దెయ్యాలు అంటూ మాట్లాడటం ఆయనకు, రాష్ట్రానికీ గౌరవం పెంచే పనైతే కాదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ద్వేషం, కోపం ఏమైనా ఉండవచ్చు. కానీ, అందుకోసం ఇలా తనను తాను భూత వైద్యుడిగా పోల్చుకుంటూ భూస్థాపితం చేస్తానంటూ ఉపన్యాసాలు చెబితే ఎవరికి నష్టం?.
ఆధునిక సమాజంలో భూత వైద్యులను ఎవరైనా విశ్వసిస్తారా? అలా నమ్మేవారు ఎవరైనా ఉంటే వారు అమాయకులు, అంధ విశ్వాసాలను అనుసరించేవారై ఉంటారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకు వెళతారనో, లేక తాము చేసిన హామీలను నెరవేర్చుతారనో ప్రజలు ఓట్లు వేస్తే, వారికి భేతాళ మాంత్రికుడి కబుర్లు చెబితే ఎలా?. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, గత ప్రభుత్వ హయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన జగన్ ఎన్నడైనా ఈ భూతాల భాష వాడారా?. ఆయన హయాంలో రిలయన్స్ అంబానీ, అదానీ, జిందాల్, ఆదిత్య బిర్లా వంటి పెద్ద, పెద్ద పారిశ్రామికవేత్తలు విశాఖలో సదస్సులో పాల్గొని ఏపీ గురించి ఎంత గొప్పగా మాట్లాడారు!. వైఎస్ జగన్ దార్శనికతను ఎంతగానో మెచ్చుకున్నారు. వారిలో ఇప్పుడు ఎవరైనా జగన్‌ను భూతంగా చెప్పారా?. మళ్లీ అ భూతం వస్తుందా అని ఎవరైనా అడిగారా?. అది నిజంగా జరిగి ఉంటే వారి పేర్లు చెబుతారా?.
అదేమీ లేకపోయినా చంద్రబాబు ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీస్తున్నట్లు?. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం బాగుండాలి. వారికి అవసరమైన వసతులు, రాయితీలు కల్పించాలి. వైఎస్ జగన్ ఏమని చెప్పేవారు.. పారిశ్రామికవేత్తలు ఎవరైనా సరే.. తనకు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు.. వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని అనేవారు. అంతే తప్ప అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అలాంటి సమావేశాలలో కానీ, ఇతరత్రా పెట్టుబడిదారులు వచ్చినప్పుడు గానీ.. జగన్ ఒక్కమాటైనా అన్నట్లు లేదు. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న గ్రీన్ ఎనర్జీకి సంబంధించి లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చింది. సంబంధిత పరిశ్రమలు ఆచరణలోకి రావడం ఆరంభమైందీ జగన్ టైమ్‌లోనే కాదా?. కర్నూలు వద్ద వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్ కో ప్లాంట్ వచ్చింది జగన్ హయాంలోనే.. అప్పుడు వచ్చిన పరిశ్రమలు కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేసి తమ ఘనతేనని కూటమి పెద్దలు చెప్పుకోవడం లేదా?. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. కానీ, గత ప్రభుత్వంపై నిత్యం నిందారోపణలు చేస్తూ పెట్టుబడిదారులలో అనుమానాలు కల్గించేలా చేస్తే ఎవరైనా ధైర్యంగా పరిశ్రమలు పెడతారా?.
అసలే కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికంగా, శాంతిభద్రతల రీత్యా అంత అనుకూల వాతావరణం లేదన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. పలు చోట్ల ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను కూటమి బెదిరించి డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల నిర్వాకాల వల్ల పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డ ఘటనలు చోటు చేసుకున్నాయి. చివరికి విద్యుత్ ప్లాంట్ల బూడిద గురించి కూడా కూటమి నేతలు గొడవలు పడ్డారే!.. అంతెందుకు! ఒక మాజీ ఎమ్మెల్యే తన ప్రాంతమైన తాడిపత్రిలో ఇంటికి వెళ్లడానికి ప్రయత్నిస్తే టీడీపీ నేత ఒత్తిడితో పోలీసులు ఆయనను బలవంతంగా అనంతపురం తరలించారే. ప్రభుత్వ పెద్దలకు తెలియదా! ఇది మంచి వాతావరణమా?.
సాక్షి మీడియాతో పాటు మరికొన్ని మీడియా సంస్థలపై కక్ష కట్టి ప్రభుత్వం చేస్తున్న పనులు పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటాయా?. ఏదో ఒక సాకుతో సాక్షి మీడియా సంస్థలపై ఏపీ వ్యాప్తంగా దాడులు చేయిస్తే, దాడులకు తెగబడిన మూకలపై సరైన చర్య తీసుకోకపోతే శాంతిభద్రతలు ఉన్నట్లా? లేనట్లా?. ఈ వార్తలు దేశవ్యాప్తంగా ప్రజలకు తెలియవా?. పారిశ్రామికవేత్తలు గమనించరా?. ఒక పారిశ్రామికవేత్తను సైతం ఒక మోసకారి నటి కేసులో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించగా, ఆయన ఏపీలో కాకుండా మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టడానికి ప్రతిపాదించింది వాస్తవం కాదా?. ప్రజలలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఇలా భూతాల కబుర్లు చెబుతున్నారని పారిశ్రామికవేత్తలు ఊహించలేరా!.
వైఎస్ జగన్ ఏపీలో ఎక్కడకు వెళుతున్నా ప్రజలలో వస్తున్న ఆదరణను తట్టుకోలేక చంద్రబాబు ఇలాంటి మాటలు అంటున్నారని వారికి తెలియకుండా ఉంటుందా?. జగన్ టైమ్‌లో పరిశ్రమలు రాకుండా అడ్డుకోవడానికి టీడీపీ మీడియా చేయని ప్రయత్నం ఉందా?. ఆదానికి భూమి కేటాయిస్తే మొత్తం రాష్ట్రాన్ని రాసిచ్చేస్తున్నారంటూ ప్రచారం చేశారే? ఇన్ని ఉదాహరణలు ఎదురుగా పెట్టుకుని జగన్ టైంలో విధ్వంసం జరిగిందని, భూతమని, మరొకటని డైలాగులు చెబితే పారిశ్రామిక వేత్తలు అంత అమాయకులా? నమ్మడానికి!. వారు అమాయకులైన సాధారణ ప్రజల మాదిరి కాదు కదా!. సాధారణ ప్రజలు ఎన్నికల సమయంలో బహుషా భూత వైద్యులను నమ్మి ఉండవచ్చు. ఇష్టారీతిన చేసిన వాగ్ధానాలకు ఆకర్షితులై ఉండవచ్చు. అల్లాఉద్దీన్ అద్భుత దీపం అనుకుని ఓట్లు వేసి ఉండవచ్చు. లేదా ఈవీఎంల మహిమ ఉండవచ్చన్న భావన కూడా లేకపోలేదు.
కూటమి అధికారంలోకి వచ్చాక కానీ.. వారికి భూత వైద్యులను నమ్మడం వల్ల లాభం లేదని తెలిసి ఉండవచ్చు. అందుకే ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతను తట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ భూతం కబుర్లు చెప్పి ప్రజలను డైవర్ట్ చేయాలని తలపెట్టినట్లు కనిపిస్తుంది. ఆ భూతం రాదని తనది హామీ అని చంద్రబాబు అంటున్నారు. ఈసారి ఏమర పాటుగా లేనని అంటున్నారు. అంటే ఏమిటి అర్థం? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానం కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లు అనిపించదా!. భూత వైద్యులను విశ్వసిస్తే ఉన్న వ్యాధులు పోకపోగా కొత్త రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో భూత వైద్యుల పాలనలో అదే పరిస్థితి ఏర్పడుతోందా?.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.