
బిహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ఓటర్ల విముఖత
2020లో 127 మంది తొలిసారి ఎమ్మెల్యేలు
బిహార్‌లో త్వరలో జరుగనున్న 18వ శాసనసభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు అస్త్రశ్రస్తాలతో సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై దృష్టి పెట్టాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. సిట్టింగ్‌లతో పోలిస్తే ఓటర్లు కొత్త అభ్యర్థులకే పట్టం కట్టడం బిహార్‌లో ఆనవాయితీగా వస్తోంది. 2010, 2015, 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. గత మూడు పర్యాయాలు అసెంబ్లీలో అడుగు పెట్టినవారిలో సగానికి పైగా ఎమ్మెల్యేలు మొదటిసారి పోటీ చేసి గెలిచినవారే కావడం విశేషం. విజేతల్లో ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉండడం బిహార్ ప్రత్యేకత అని చెప్పొచ్చు. అభ్యర్థులను వరుసగా రెండోసారి గెలిపించడానికి ఓటర్లు ఇష్టపడడం లేదు.
కొత్త ముఖాలు 50 శాతానికి పైగానే..
బిహార్‌లో శాసనసభ స్థానాల సంఖ్య 243. 2010 ఎన్నికల్లో ఏకంగా 150 మంది మొదటిసారి విజయం సాధించారు. అంటే 61.7 శాతం మంది తొలిసారి అసెంబ్లీలో ప్రవేశించారు. 2015లో వీరి సంఖ్య కొంత తగ్గింది. 243 మందికి గాను 131 మంది తొలిసారి గెలిచారు. 53.9 శాతం మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయినవారు ఉన్నారు. 2020 ఎన్నికల్లో 127 మంది ఫస్ట్‌టైమ్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ వీరి వాటా 52.3 శాతం. మొత్తానికి కొత్త ముఖాల సంఖ్య 50 శాతానికిపైగానే ఉండడం గమనార్హం. రెండోసారి కంటే మూడోసారి గెలిచిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఈసారి ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందా? లేక ఓటర్లు మనసు మార్చు కుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
సిట్టింగ్‌లకు కష్టకాలమే
రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోసారి పోటీచేసి నెగ్గడం గగనకుసుమంగా మారుతోంది. గత 20 ఏళ్లుగా వారి సక్సెస్ రేటు క్రమంగా పడిపోతోంది. 2005లో పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 71.4 శాతం మంది మళ్లీ గెలిచారు. 2010లో పోటీచేసినవారిలో కేవలం 55 శాతం మంది రెండోసారి ఎన్నికయ్యారు. 2015లో వీరి సంఖ్య 53.1 శాతానికి పడిపోయింది. 2020 ఎన్నికల్లో 48.6 శాతం మంది మరోసారి గెలిచారు. పాత ఎమ్మెల్యేలను పక్కనపెట్టి కొత్త నేతలకు ఓటర్లు పట్టం కడుతుండడం అశావహులకు వరం లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా యువత ఈ అవకాశం సది్వనియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్