
బిహార్‌లో గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ వేట
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్‌లో సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పథక రచన చేస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు 243 స్థానాల్లో గెలుపు గుర్రాల కోసం వేట కొనసాగిస్తోంది. సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమి ఆమోద ముద్ర వేసేవరకూ ఈ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కొనసాగనున్నది.
ఆశావహుల నుంచి ఇప్పటికే 2,300పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల ఆధారంగా పార్టీ బలం, బలహీనతలపై ఒక అవగాహనతోపాటు.. కొత్తగా ఎదుగుతున్న నేతలపై ప్రధానంగా దృష్టి సారించడమే రాష్ట్ర కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానున్నది. 14వ తేదీలోగా అభ్యర్థుల జాబితాను పంపాలని రాష్ట్ర పార్టీ కోరింది. 16న జరిగే సమావేశంలో ఈ పేర్లపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.
ఒక్కో సీటుకు ముగ్గురు పోటీ: రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిటీ మొత్తం 243అసెంబ్లీ స్థానా ల్లో ఒక్కో సీటు నుంచి ముగ్గురి పేర్లను సిద్ధం చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపించనున్నది. ఈ నెల 19న జరగనున్న కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దరఖాస్తులను పరిశీ లించనున్నారు. అంతిమంగా ఒకరి పేరును ఎంపిక చేసి ఆమోదం కోసం ఢిల్లీలోని అధిష్టానానికి పంపించనున్నారు. ఇదే జాబి తాను యథాతథంగా లేదా కొద్ది మార్పులతో అధిష్టానం ప్రటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.