
పాట్నా: రాజ్యాంగంలో 130వ అధికరణకు సవరణ బిల్లుపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నేరారోపణలు ఎదుర్కొన్న నేతలు ఎంజాయ్ చేస్తూ జైలు నుంచి ఆర్డర్లు పాస్ చేసే రోజులు పోయాయి. ఇకపై ఎంతటి నేతైనా 30 రోజులు జైలు శిక్షను అనుభవిస్తే సదరు నేత పదవి కోల్పోనున్నారని స్పష్టం చేశారు.
త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కేంద్రం పావులు కుదపుతోంది. ఇందులో భాగంగా బీహార్‌లోని గయలో శుక్రవారం ప్రధాని మోదీ రూ.13వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఆర్జేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ గత పాలనను ‘లాంతర్ యుగం’గా అభివర్ణించారు. తద్వారా రాష్ట్రాన్ని అంధకారం, అక్రమం, వెనుకబాటుతనంలోకి నెట్టారని ఆరోపించారు.30 కంటే ఎక్కువ రోజుల జైలు శిక్షను అనుభవించిన నేతలు పదవుల్లో కొనసాగే అవకాశం లేకుండా ప్రతిపాదించిన బిల్లుకు మద్దతిచ్చారు. బీహార్ ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించి, వారి ఆకాంక్షలు, గౌరవం , అభివృద్ధిని విస్మరిస్తున్న పార్టీలను లక్ష్యంగా చేసుకుని‘జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతూ ఆదేశాలు ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేశారు.
‘ఒక ప్రభుత్వ ఉద్యోగి 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే.. డ్రైవర్, గుమస్తా,ఉన్నత ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతాడు. కానీ ఒక ముఖ్యమంత్రి, మంత్రి లేదా ఇతర ప్రజాప్రతినిధులు జైలు నుంచి ఆదేశాలు ఇవ్వొచ్చా. కొంత కాలం క్రితం, పలువురు నేతలు జైల్లో ఉండి ఫైళ్లమీద ఎలా సంతకం చేశారో.. జైలు నుండి ఆదేశాలు ఎలా ఇచ్చారో మనం చూశాం. నాయకులు అలా ఉంటే మనం అవినీతిపై ఎలా పోరాడగలం? అని ప్రశ్నించారు. ఎన్‌డీఏ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. ఇకపై జైలు నుంచి నేతల పరిపాలన ఉండదు. ప్రధాని,ముఖ్యమంత్రి,మంత్రులు ఇలా ఎవరికైనా ఒకటే రూల్. ఈ బిల్లు చూసి కాంగ్రెస్,ఆర్జేడీ,వామపక్షాలు భయపడుతున్నాయి. పాపం చేసిన వాలల్లకే భయం ఉంటుందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.
