
పెరుగుతున్న నాడీ సంబంధ రుగ్మతలు
2021 నాటికి 340 కోట్లకుపైగా బాధితులు
ఏటా మరణిస్తున్న వారు 1.1 కోట్ల మంది
జాతీయ విధానం ప్రకటించిన దేశాల్లో భారత్
ప్రముఖంగా ప్రస్తావించిన డబ్ల్యూహెచ్‌వో నివేదిక
అల్జీమర్స్, స్ట్రోక్, మూర్ఛ.. ఇలాంటి నాడీ సంబంధ సమస్యలు ప్రపంచంలో 40 శాతానికిపైగా జనాభాను కుంగదీస్తున్నాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారంగా పరిణమిస్తున్నాయని వెల్లడించింది. సంస్థ చరిత్రలో తొలిసారి ఈ వ్యాధులపై ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ న్యూరాలజీ’ పేరిట నివేదికను విడుదల చేసింది. మొత్తం సభ్య దేశాల్లో కేవలం 32 శాతం (63 దేశాలు) మాత్రమే.. నాడీ సంబంధ సమస్యల నివారణకు జాతీయ విధానం ప్రకటించాయని, ఇందులో భారత్ కూడాఉందని నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్
ప్రపంచంలోని మూడో వంతు దేశాల్లో కూడా.. పెరుగుతున్న నాడీ సంబంధ సమస్యలపై ఇప్పటికీ నిర్దిష్ట జాతీయ విధానం అంటూ ఒకటి లేదు. 2021 నాటికి ప్రపంచ జనాభాలో సుమారు 42 శాతం మంది (దాదాపు 340 కోట్లకుపైగా) ప్రజలు నాడీ సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారు. వీటివల్ల ఏటా 1.1 కోట్ల మంది మరణిస్తున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ న్యూరాలజీ’ వెల్లడించింది.
జాతీయ విధానం 32%దేశాల్లోనే..
ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఉన్న మొత్తం 194 సభ్య దేశాల్లో 102 మాత్రమే ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. ప్రపంచ జనాభాలో 71 శాతం ఈ దేశాల్లోనే ఉంది. మొత్తం సభ్య దేశాల్లో 32 శాతం (63 దేశాలు) మాత్రమే.. నాడీ సంబంధ సమస్యల నివారణకు జాతీయ విధానం ప్రకటించాయి. కేవలం 34 దేశాలే.. ఇందుకోసం నిధులు కేటాయించాయట. 49 దేశాలు (25 శాతం) మాత్రమే.. ఆయా దేశాల్లోని సార్వత్రిక ఆరోగ్య పథకాల్లో నాడీ సంబంధ సమస్యలను చేర్చాయి.
ఒక డాలర్ ఖర్చు.. 10 డాలర్ల రాబడి
నాడీ సంబంధ సమస్యలు.. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంపై అన్ని దేశాలూ విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నాడీ సంబంధ వ్యాధుల నివారణకు చేపట్టే చర్యలు దీర్ఘకాలంలో ఆర్థికంగా ప్రయోజనకరమైనవేనని తెలిపింది. ‘ఉదాహరణకు స్ట్రోక్, హృద్రోగాలపై పెట్టే ఒక డాలర్ ఖర్చు.. 10 డాలర్ల కంటే ఎక్కువ రాబడి ఇస్తుంది. ఇలా ఆలోచిస్తే ఈ సమస్యలన్నింటిపైనా చేసే ఖర్చును వ్యయంలా భావించలేం. అవి భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలను సుసంపన్నం చేసే పెట్టుబడులే’ అని పేర్కొంది.
నివేదికలో మనదేశ ప్రస్తావన
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికలో మనదేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కర్ణాటక రాష్ట్రం ‘కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనీషియేటివ్ (కభీ)’ పేరిట ఆ రాష్ట్రంలో నాడీ సంబంధ రుగ్మతల నివారణకు సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి 2023లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది.
ఇందులో భాగంగా 32 క్లినిక్‌లు ఏర్పాటుచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రోక్, డిమెన్షియా వంటి రుగ్మతలతో బాధపడేవారి వివరాలను డిజిటైజ్ చేసింది. అనేక రూపాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమ స్ఫూర్తితో భారత ప్రభుత్వం 2024లో మెదడు ఆరోగ్యంపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసింది.
2021లో మరణాలు లేదా అంగ వైకల్యానికి కారణమైన ప్రధాన నాడీ సమస్యలు..
స్ట్రోక్, అప్పుడే పుట్టిన పిల్లల్లో మెదడులో సమస్యలు, మైగ్రెయిన్, అల్జీమర్స్, మతిభ్రమణం, డయాబెటిక్ న్యూరోపతి, మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరల వాపు), నెలలు నిండక ముందే పుట్టే పిల్లల్లోని నాడీ సంబంధ సమస్యలు, ఆటిజం సంబంధిత సమస్యలు, నాడీ సంబంధ కేన్సర్లు.
2021 గణాంకాల ప్రకారం చూస్తే.. మైగ్రెయిన్, మల్టిపుల్ స్కె›్లరోసిస్ (కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి) మహిళల్లో ఎక్కువగా ఉంటే.. పార్కిన్సన్స్, స్ట్రోక్ పురుషుల్లో ఎక్కువగా ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా 2021లో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 5.17 కోట్లు.