
సంస్థల్లో లీడర్లయినా, కుటుంబ పెద్దలైనా
ఆలోచనా ధోరణి మార్చుకుంటే మేలు
అసమాన నాయకత్వ ప్రతిభ కనబరిచే టీమ్ లీడర్‌లు బయటి నుంచి ఎదురయ్యే సవాళ్ల వల్ల కాకుండా.. తమ అపరిమితమైన ఆత్మవిశ్వాసం వల్ల విఫలమవుతుంటారని ‘హార్వర్డ్ బిజినెస్ రివ్యూ’ (హెచ్.బీ.ఆర్.) తాజా సంచికలోని ఒక వ్యాసం విశ్లేషించింది. ఇందులో ముఖ్యంగా కొన్ని లక్షణాలు.. ఇటు నాయకులు / లీడర్లు / బాస్‌లకే కాదు.. ఇంటిని నడిపే ఇంటి యజమానులకూ వర్తిస్తాయి అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.
‘ఇనుమును ఏదీ నాశనం చేయలేదు.. దాని తుప్పు తప్ప. అలాగే ఒక మనిషి పురోగతిని ఆపేసేది తన మనస్తత్వమే తప్ప బయటి వ్యక్తులో, అంశాలో కాదు’
– రతన్ టాటా
ప్రతి పనిలో నేనుండాలి
తమ ముద్ర కనిపించాలి అనే తాపత్రయంతో ప్రతి పనిలో ‘నేనుండాలి’ అని అనుకుంటారు చాలామంది.
దుష్ఫలితం: అలసట, నిస్సత్తువ పెరుగుతాయి. టీమ్‌లో చొరవ లోపిస్తుంది. ‘అన్నీ ఆయన చూసుకుంటాడులే’ అనే ధోరణి కిందివారిలో పెరిగిపోతుంది. సృజనాత్మకంగా ఆలోచించడం మానేస్తారు. పిల్లలు పెద్దయ్యాక కూడా చాలామంది తల్లిదండ్రులు వాళ్లను స్వతంత్రంగా పనిచేయనివ్వరు.
ఇలా మార్చుకొని చూడండి: ‘నేను ఏదైనా చేయగలను. కానీ ప్రతి పనీ నేనే చేయాల్సిన అవసరం లేదు’ అనే ధోరణి మంచిది. అప్పుడు అందరికీ పనిచేసే అవకాశం వస్తుంది. వినూత్నంగా ఆలోచిస్తారు. నాయకుడు అంటే నడిపించాలి కానీ ప్రతి స్థాయిలో ప్రతి పనీ తానే చేయాల్సిన అవసరం లేదు.
సంస్థల్లోని నాయకులు లేదా ఇంటికి యజమానిలో అజ్ఞాతంగా ఉండే ఆధిపత్య భావనలు వారి పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసి, వారి అభివృద్ధికి ఆటంకంగా మారతాయి. మొదట బలాలుగా కనిపించిన ఈ భావనలు క్రమేణా బలహీనతలుగా మారతాయి. బాహ్య అడ్డంకుల్లా ఇవి పైకి కనిపించవు. ఎవరికి వారు వీటిని గుర్తించి, సానుకూలంగా మలుచుకుంటే వైఫల్యాలను నివారించవచ్చు. ఎందుకంటే.. నిజమైన నాయకత్వ పురోగతి అంతర్గతంగా ప్రారంభమవుతుంది. ఏమిటీ భావనలు.. వీటి దుష్ఫలితాలేంటి.. వీటిని ఎలా అధిగమించాలి?
వెంటనే పని పూర్తి చేసేయాలి
ప్రాధాన్యతలతో సంబంధం లేకుండా.. ప్రతి పనినీ తక్షణమే పూర్తి చేయాలి, వెంటనే ఫలితాలు కనిపించాలి అనే ధోరణితో చాలామంది ఉంటారు.
దుష్ఫలితం: పిల్లలకు అన్ని అంశాల్లోనూ ఇలాగే చెప్పడం వల్ల వారికి ప్రాధాన్యతలు తెలియవు. బృందం విషయానికొస్తే.. ప్రతి పనిలోనూ ‘ఎమర్జెన్సీ’ పరిస్థితి ఏర్పడి తప్పులు జరగొచ్చు.
ఇలా మార్చుకొని చూడండి: ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి’ అన్నట్టు అవసరమైన పనిపై ముందు దృష్టి పెడతాను అనుకోవాలి. ప్రాధాన్యతలు గుర్తించడమే సగం విజయం. పిల్లలు కూడా రోజువారీ చేసే పనుల్లో ఎక్కువ ఫలితం ఇచ్చే పనికి అధిక ప్రాధాన్యత.. తక్కువ ఫలితం ఇచ్చే దానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటారు. దానికి తగ్గట్టుగా సమయం, ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారు.
నేను తప్పులు చెయ్యకూడదు
పనిలో కచ్చితత్వం కోసం తపన పడుతూ ఇలా ఆలోచిస్తుంటారు.
దుష్ఫలితం: వినూత్న విధానాలను ప్రయత్నించే ధైర్యం చేయలేకపోవడం, అతి జాగ్రత్త, ఎప్పుడూ ఫలితంపైనే అధిక శ్రద్ధ.
ఇలా మార్చుకొని చూడండి: ‘తప్పులు జరగకుండా చూడటం కాదు, సరిగ్గా పని జరిగేటట్లు చూడాలి’ అనే ధోరణి ఏర్పరచుకోవాలి. ఇది కింది వాళ్లను మూస ధోరణిలో కాకుండా కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఫలితంపై శ్రద్ధ కాకుండా.. పనిని సరిగ్గా చేయడం అలవాటవుతుంది.
అందరూ నాలాగే పని చెయ్యాలి
ఇంట్లో లేదా ఆఫీసులో అందరూ తమలాగే ఆలోచించాలని, పనిచేయాలని.. ఆలోచిస్తారు, ఆశిస్తారు.
దుష్ఫలితం: వ్యక్తిగత సామర్థ్యాలలోని వ్యత్యాసాలు గుర్తించరు. ఎవరి సామర్థ్యానికి, పనిచేసే ఒడుపునకు తగ్గట్టు వారిని స్వేచ్ఛగా పనిచేయనివ్వరు. ముఖ్యంగా పిల్లల విషయంలో వారి వయసును కూడా ఒక్కోసారి మర్చిపోయి వారిపై ఒత్తిడి పెంచుతుంటారు.
ఇలా మార్చుకొని చూడండి: ‘నాలా అందరూ ఆలోచించలేకపోవచ్చు, పనిచేయలేకపోవచ్చు’ అనే వాస్తవాన్ని గుర్తించండి. వారి వారి సామర్థ్యాలు, తెలివితేటలకు అనుగుణంగా పనిచేసే వాతావరణం కల్పించండి. ముఖ్యంగా ఇది పిల్లల మానసిక వికాసానికి దోహదపడుతుంది.