ఆరోగ్యానందాలు | Side Effects of Meditation | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానందాలు

Oct 19 2025 5:54 AM | Updated on Oct 19 2025 5:54 AM

Side Effects of Meditation

ఈ ఆరింటి సైడ్‌ ఎఫెక్ట్స్‌!

ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే మంచి పోషకాహారం, ధ్యానం వంటి వాటితోపాటు కొన్ని చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టాలి. వీటి ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’ జీవితాన్ని మార్చేస్తాయి అంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా చేసిన అనేక పరిశోధనలు, అధ్యయనాలు. ‘చిన్నగా మొదలుపెట్టి.. వాటిని కొనసాగించడం’.. ఇదే ఆరోగ్యవంతమైన జీవితానికి కొత్త సూత్రం అంటున్నారు వైద్యులు, మానసిక నిపుణులు.

రాత్రి నిద్రకు అలారం
సాధారణంగా అందరూ ఉదయం లేవడానికి అలారం పెట్టుకుంటారు. కానీ, రాత్రి ఎప్పుడు పడుకుంటాం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వరు. స్మార్ట్‌ఫోన్లు, ఓటీటీ వేదికలు, స్నేహితులు లేదా బంధువులతో పిచ్చాపాటీ.. ఇవన్నీ ప్రాధాన్యతలుగా మారిపోయి నిద్రా సమయం వెనక్కిపోతోంది. అందుకే, ఎన్ని గంటలకు నిద్ర పోవాలనుకుంటున్నారో అలారం పెట్టుకోవాలి. అలారం మోగగానే.. ఏ పనిచేస్తున్నా ఆపేసి నిద్రకు ఉపక్రమించాలి. అలా అలారం పెట్టుకుని పడుకున్నవాళ్లకు ప్రశాంతమైన నిద్ర పట్టడమే కాకుండా.. మర్నాడు రోజంతా చురుగ్గా ఉన్నారని  మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అధ్యయనం వెల్లడించింది.

ప్రకృతిని పలకరించండి
ప్రతిరోజూ కనీసం 10–20 నిమిషాలు ప్రకృతిని ఆస్వాదించండి. దగ్గరలోని పార్కుకు వెళ్లండి. అలా రోడ్డుమీదకు వెళ్లి చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలు, పక్షులను చూడండి. దగ్గరిలోని చెరువుకు లేదా నదికి వెళ్లండి. మేడమీదకు వెళ్లి పరిసరాలు, మేఘాలు అన్నింటినీ ప్రశాంతంగా చూడండి. 2019లో యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగన్‌ నిర్వహించిన అధ్యయనం.. ప్రకృతిని మాత్రగా (నేచర్‌ పిల్‌) అభివర్ణించింది.

స్నాక్టివిటీ.. వర్కవుట్‌ స్నాక్స్‌!
ఆరోగ్యం కోసం రోజూ జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. రోజులో వీలు చిక్కినప్పుడల్లా శరీరానికి ‘వర్కవుట్‌ స్నాక్స్‌’ ఇవ్వండి. చిన్న చిన్న వ్యాయామాలుగా పిలిచే ఈ ‘స్నాక్టివిటీ’ చేస్తే చాలు. మీకు తెలియకుండానే వారానికి ‘150 నిమిషాల వ్యాయామం’ కింద పోగుపడతాయి. ఎక్సర్‌సైజ్‌ స్నాక్స్‌ అనే పదాన్ని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కి చెందిన కార్డియాలజిస్టు డాక్టర్‌ హోవర్డ్‌ హార్ట్‌లీ మొట్టమొదట ఉపయోగించారు. ఫోన్‌ మాట్లాడేటప్పుడు కూర్చుని కాకుండా.. అలా నడుస్తూ మాట్లాడండి. అన్ని సార్లూ లిఫ్ట్‌లో వెళ్లకుండా రోజులో రెండు మూడుసార్లు.. మీరుండే ఫ్లోరును బట్టి మెట్లు ఎక్కి, దిగండి. మీకు నచ్చిన పాట చూస్తూ 5–10 నిమిషాలు మామూలుగా డ్యాన్స్‌ చేయండి. రోజువారీ జీవితంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇలాంటివి ఎవరికి వారే వెతుక్కోవాలి.

భోజనం చేశాక నడవండి
భోజనం పూర్తయిన కాసేపటి వరకు కూర్చుంటే ఫర్వాలేదు గానీ.. ఎక్కువ సమయం కూర్చోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తిన్న కాసేపటి తర్వాత కనీసం ఓ 10 నిమిషాల పాటు అలా నెమ్మదిగా నడిస్తే మంచిదట. రాత్రుళ్లు టీవీల ముందు కూర్చుని భోజనం చేసే సంస్కృతి పెరిగాక భోజనం అయిపోయినా కుర్చీలోంచి లేవడం లేదు.. చూస్తున్న కార్యక్రమం అయ్యాకే లేస్తున్నారు. ఇది మంచిది కాదు.

నైట్‌ టైమ్‌.. నో ఫోన్‌
రాత్రిపూట బెడ్‌రూముల్లో టీవీలు చూస్తూ లేదా స్మార్ట్‌ఫోన్లు చూస్తూ పడుకోవడం పెరిగిపోయింది. ఇది కంటికి మంచిది కాదనీ, వీటివల్ల ‘నాణ్యమైన నిద్ర’ ఉండటం లేదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. 2024లో అమెరికాలో జరిగిన ఒక  అధ్యయనంలో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు చూడకుండా పడుకున్నవారు రాత్రుళ్లు వేగంగా నిద్రపోవడమే కాదు, ఉదయాన కూడా త్వరగా లేస్తున్నారని తేలింది. చాలామందికి అర్ధరాత్రి నీళ్లు తాగడానికో బాత్‌రూముకో వెళ్తారు. అలా లేవగానే స్మార్ట్‌ఫోన్‌నే చూస్తుంటారు. అక్కడితో వదిలేయరు. లేచిన పని పూర్తయ్యాక మళ్లీ ఫోన్‌ అందుకుంటారు. ఇది కూడా కంటికి, నిద్రకు మంచిది కాదు.

బ్రష్‌ చేసే చేతిని మార్చండి
మనం రోజూ చేసే పనుల్లో కొన్నింటిని.. నెలకో రెండు నెలలకో ఒకసారి వినూత్నంగా చేయడం మన మెదడును మరింత చురుగ్గా పనిచేసేలా చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరానికి వ్యాయామాలు ఎలా అవసరమో.. మెదడుకూ అలాగే అవసరం. అలాంటి వాటిలో ఒకటి.. బ్రష్‌ చేసే చేతిని మార్చడం. మీరు ఇప్పటివరకూ చేస్తున్న చేతితో కాకుండా.. రేపటి నుంచి రెండో చేతితో చేయడం ప్రాక్టీస్‌ చేయండి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement