మహిళల మెదడు సేఫ్‌! | Side effects of anti-stress drugs are less on women | Sakshi
Sakshi News home page

మహిళల మెదడు సేఫ్‌!

Jul 5 2025 1:18 AM | Updated on Jul 5 2025 1:18 AM

Side effects of anti-stress drugs are less on women

ఒత్తిడి తగ్గించే ఔషధాల దుష్ప్రభావం స్త్రీలపై తక్కువే

దీర్ఘకాలంలో పురుషుల్లోనే కొన్ని ప్రతికూల మార్పులు

విటమిన్‌ బీ3 వాడకంతో తగ్గుతున్న దుష్ప్రభావాలు

గర్భిణులకు, పుట్టబోయే పిల్లలకు గొప్ప శుభవార్తే

‘మనసున్న మనిషికి సుఖము లేదంతే..’ అన్నారు ఆచార్య ఆత్రేయ. సుఖం ఉండకపోగా, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ప్రమాదమూ ఉండొచ్చు. ‘యాంటీడిప్రెసెంట్స్‌’లు వాడి ఆ డిప్రెషన్‌ నుంచి∙బయట పడొచ్చనుకోండీ.. అయితే వాటిని వాడితే మెదడుపై దీర్ఘకాల దుష్ప్రభావాలు  ఉంటాయని శాస్త్ర పరిశోధకులు కనిపెట్టారు. ‘ఇందులో కొత్తేముందీ!’ అంటారా? ఉంది. యాంటీడిప్రెసెంట్‌లు వాడితే మెదడుపై పడే దుష్ప్రభావాలు మగవాళ్లలోనే కానీ, ఆడవాళ్లలో కాదట!

మానసిక రుగ్మతలకు వైద్యులు సిఫారసు చేసే ‘యాంటీడిప్రెసెంట్‌’ ఔషధాలు దీర్ఘకాలంలో పురుషుల మెదడుపై దుష్ప్రభావాలు చూపే అవకాశాలు ఉండగా, మహిళల్లో అలాంటి ప్రభావం దాదాపు లేదని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టి.ఐ.ఎఫ్‌.ఆర్‌.) శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే యాంటీడిప్రెసెంట్లు పురుషుల మెదడుపై ఈ విధంగా ప్రభావాన్ని చూపటం అన్నది వారి  వయసుపై కూడా ఆధారపడి ఉండొచ్చని వారు భావిస్తున్నారు.

యాంటీ డిప్రెసెంట్‌లు ఏం చేస్తాయి?
సెరటోనిన్‌ అనే న్యూరోహార్మోన్‌ మెదడులోని భావోద్వేగాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆ హార్మోన్‌ను నియంత్రించటమే యాంటీడిప్రెసెంట్ల పని. నిరాశ, నిస్పృహ, ఆందోళన తదితర న్యూరోసైకియాట్రిక్‌ వ్యాకులతలకు వైద్యులు ప్రధానంగా ‘సెలెక్టివ్‌ సెరటోనిన్‌ రీఅప్టేక్‌ ఇన్హిబిటర్లు’ (ఎస్‌.ఎస్‌.ఆర్‌.ఐ.లు) సిఫారసు చేస్తారు. ఈ మందులు మెదడులోని సెరటోనిన్  అధికం చేసి మానసిక ఉపశమనానికి తోడ్పడతాయి.

మగ ఎలుకల్లోనే మార్పులు
ఎస్‌.ఎస్‌.ఆర్‌.ఐ.లలో విస్తృతంగా వాడుకలో ఉన్న ఔషధం ‘ఫ్లూఆక్సిటీన్‌’. గర్భిణులు, బాలింతలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు సహా అన్ని వయసుల వారికి వైద్యులు సిఫారసు చేసే ఈ ఫ్లూఆక్సిటీన్‌ దీర్ఘకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయన్న విషయమై ఎలుకల మెదడుపై జరిపిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన సంగతులు వెల్లడయ్యాయి. ఫ్లూఆక్సిటీన్‌ను ఇవ్వడం వల్ల మగ ఎలుకల మెదడులో విస్తృతమైన వ్యతిరేక మార్పులు కనిపించాయి. పుట్టిన కొద్ది రోజుల వయసున్న ఎలుకలకు యాంటీడిప్రెసెంట్‌లను ఇచ్చినప్పుడు క్రమేణా ఆందోళన స్థాయిలు పెరిగాయి.

లైంగిక పరిపక్వతకు చేరుకున్న దశలో ఉన్న ఎలుకలకు ఇచ్చినప్పుడు అవి తక్కువ ఆందోళనను కనబరిచాయి. ఈ మందు ఇచ్చిన ఆడ ఎలుకల ప్రవర్తన, మెదడు నిర్మాణం, మైటోకాండ్రియా లేదా జన్యు వ్యక్తీకరణలలో మార్పులేమీ కనిపించలేదు. బహుశా ఇందుకు ఈస్ట్రోజెన్, ఇతర స్త్రీ హార్మోనుంచి రక్షణ లభిస్తుండవచ్చునని తెలిపారు. జెండర్‌ క్రోమోజోమ్‌లు, జన్యుపరమైన వ్యత్యాసాలపై మరింత అధ్యయనం జరిపితే దీనిపై నిర్ధారణకు అవకాశం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

అత్యంత సాధారణ ఔషధం
‘ఫ్లూఆక్సిటిన్‌’ అనేది 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారికి, గర్భిణులకు చికిత్సపరంగా మంచి ఫలితాల కోసం ఇచ్చే అత్యంత సాధారణ ఔషధం. ప్రొజాక్, ఫ్లూడాక్‌ వంటి బ్రాండ్‌పేర్లతో ఇది లభిస్తోంది. అయితే దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది’ అని తాజా పరిశోధనా పత్రాన్ని సమర్పించిన ముఖ్య అధ్యయనకర్త ఉత్కర్షా ఘాయ్‌ అంటున్నారు. ఘాయ్‌ ముంబైలోని టి.ఐ.ఎఫ్‌.ఆర్‌. (టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌) లో పీహెచ్‌డి, బెంగళూరులోని నిమ్‌హాన్స్‌లో పోస్ట్‌డాక్టరల్‌ రీసెర్చ్‌ చేశారు.  

అధ్యయనం జరిగిన విధానం
ఫ్లూఆక్సిటిన్‌ తీసుకున్న తర్వాత.. సెక్సువల్‌ హార్మోన్లు క్రియాశీలకం కావడానికి ముందు, తర్వాత మెదడుపై ప్రభావాలను అధ్యయనం చేసేందుకు టి.ఐ.ఎఫ్‌.ఆర్‌. శాస్త్రవేత్తల బృందం ఎలుకల్ని రెండు జట్లుగా విభజించింది. ఒక జట్టు : ఎలుకలు 2 నుండి 21 రోజుల వయసున్నవి. ఇంకో జట్టు : 28–48 రోజుల వయసున్నవి. అప్పుడే పుట్టిన ఎలుకల్లో ఈ మందు వాడకంతో ఆందోళన క్రమంగా పెరిగింది. అదే రెండో జట్టు ఎలుకల్లో ఒత్తిడి, ఆందోళన స్వల్పంగా తగ్గాయి. ఈ అధ్యయన ఫలితాలను మానవుల్లోనూ అవే రెండు దశలుగా శైశవ దశ నుంచి శరీరంలో సెక్సువల్‌ హార్మోన్లు కనిపించే వయసు వరకు; టీనేజీ నుంచి 25 ఏళ్ల వరకు ఈ బృందం అన్వయించింది.  

సహాయకారిగా విటమిన్‌ బి3
యాంటీడిప్రెసెంట్‌ల వాడటం వల్ల కొందరి మెదడుపై కనిపించే దుష్ప్రభావాలను తగ్గించేందుకు చేసిన అధ్యయనంలో భాగంగా ఈ బృందం విటమిన్‌ బి3 (నికోటినమైడ్‌)ని ఎలుకలకు ఇచ్చింది. ఆశ్చర్యకరంగా, పుట్టి కొద్ది రోజులే అయిన ఎలుకలలో గమనించిన అనేక ప్రతికూల ప్రభావాలు బి3 ప్రభావంతో ఉపశమించాయి. వాటి జీవక్రియ పునరుద్ధరణ జరిగింది. వాటి నిరాశ, నిస్పృహల ప్రవర్తనలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది.

దీంతో వైద్యులకు ఒక ఆశారేఖ దొరికినట్టయింది. తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి ఉండి.. ఆత్మహత్య చేసుకోవాలనుకునే మానసిక స్థితి ఉన్న గర్భిణులకు ఎస్‌ఎస్‌ఆర్‌ఐలు తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. అలా ఇస్తే వాటి ప్రభావం పుట్టే పిల్లలపై పడుతుంది. కానీ, విటమిన్‌ బీ3 వాడితే... ఆ ప్రభావం తగ్గుతుందని ప్రస్తుత పరిశోధనల్లో కొంత వరకు తేలింది. ఇది గర్భిణులందరికీ గొప్ప శుభవార్తే. కాకపోతే పూర్తిస్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement