
ప్రపంచ దేశాల్లో 20 శాతం పెరుగుదల నమోదు
2024 మొదటి 6 నెలల్లో 1.61 లక్షల కోట్ల డాలర్లు
2025లో జనవరి–జూన్‌లో 1.92 లక్షల కోట్ల డాలర్లు
2024–25లో 13 శాతం పెరిగిన మన దిగుమతులు
కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తులు.. 2025 మొదటి ఆరు నెలల్లో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో పేర్కొంది. సెమీకండక్టర్లు, ప్రాసెసర్లు, సర్వర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు.. ఇలా ఏఐలో అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. మనదేశం నుంచి ఏఐ సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నా.. ఇప్పటికీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం.
2024 మొదటి ఆరు నెలల్లో కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తుల వాణిజ్యం విలువ 1.61 లక్షల కోట్ల డాలర్లు కాగా.. 2025లో ఇదే సమయంలో 1.92 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే 20 శాతం వృద్ధి అన్నమాట. మనదేశంలో 2023–24తో పోలిస్తే 2024–25లో ఏఐ సంబంధిత దిగుమతులు 13.1 శాతం పెరిగాయి. వీటి మొత్తం విలువ 66.8 బిలియన్ డాలర్లు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అత్యాధునిక కంప్యూటింగ్ హార్డ్‌వేర్ కోసం మనం ఇప్పటికీ అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. మనదేశ మొత్తం దిగుమతుల్లో.. అమెరికా నుంచి వచ్చే 5 ఉత్పత్తులదే ఏకంగా 50 శాతం వాటా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనదేశం నుంచి బోర్డులు, ప్యానెళ్లు వంటి వాటి ఎగుమతులు 2023–24తో పోలిస్తే అత్యధికంగా 58.5 శాతం పెరిగాయి.
ప్రపంచ దేశాల్లో ఏఐకి సంబంధించి విధానపరమైన చర్యలు చేపట్టిన దేశాలు ఇప్పటికీ తక్కువే ఉన్నాయని డబ్ల్యూటీవో నివేదిక చెబుతోంది. అధిక ఆదాయ దేశాల్లో 68 శాతం దేశాలు ఈ చర్యలు చేపడితే.. ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో కేవలం 30 శాతమే ఈ జాబితాలో ఉన్నాయి.