
జనగాం: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్‌కుమార్‌తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్‌కుమార్‌కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు.
దీంతో భర్త సతీశ్‌కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్‌కుమార్ హుటాహుటిన మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్‌కుమార్, యువకుడు శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్‌కె. రియాజ్‌పాషా తెలిపారు.