విద్యాశాఖను కలుషితం చేస్తున్న షాడో శక్తులు
జిల్లా విద్యాశాఖలో తవ్విన కొద్దీ అవకతవకలు వెలుగు చూసే అవకాశం ఉంది. సాక్షిలో వస్తున్న వరుస కథనాలతో జిల్లా యంత్రాంగంలో గుబులు మొదలైంది. జిల్లా విద్యాశాఖలో కొంతకాలంగా కొనసాగుతున్న షాడో శక్తుల పాత్రపై గత రెండు రోజులుగా చర్చ జరుగుతోంది. గత వేసవిలో అభ్యసనాభివృద్ధి కాార్యక్రమంలో భాగంగా మే నెలలో ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయుల వరకు ఉపాధ్యాయులకు రెండు విడతలు ఐదు రోజుల చొప్పున శిక్షణా తరగతులు నిర్వహించారు. నిబంధనల ప్రకారం ప్రతీ ఉపాధ్యాయుడికి వర్కింగ్ లంచ్ కోసం రోజుకు రూ.200 కేటా యించగా, వాస్తవానికి రూ.100 మాత్రమే ఖర్చుచేసి మిగిలిన మొత్తాన్ని అధికారులు నొక్కేశారన్న ప్రచారం టీచర్లలో ఉంది. ఈ విధంగా దాదాపు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు నిధుల దుర్వినియోగం జరిగిందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– బుర్ర రమేశ్, రాష్ట్ర కార్యదర్శి,
ప్రధానోపాధ్యాయ సంఘం


