సమస్య ఎక్కడొచ్చినా స్పందిస్తున్నాం..
జనగామ: జిల్లా విద్యాశాఖను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉత్తమ విభాగంగా తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రణాళికలతో ముందుకుసాగుతున్నామని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్‌చార్జ్ డీఈఓ పింకేశ్ కుమార్ బుధవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపారు. ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నామన్నారు. అప్పుడప్పుడూ చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటిని భవిష్యత్తులో రాకుండా సరిదిద్దుతున్నామని ఆయన చెప్పారు. విద్యా వ్యవస్థలో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా స్వయంగా పర్యటించి పరిశీలించడం, కాంప్లెక్స్ మీటింగులు నిర్వహించడం, ఉపాధ్యాయులతో నేరుగా మమేకమవుతూ వర్క్ అడ్జస్ట్‌మెంట్లు, హెడ్‌మాస్టర్లతో సమన్వయం, బోధన నాణ్యతపై దృష్టిసారిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు వివిధ అంశాలపై ఇచ్చే రిప్రజెంటేషన్లను వెంటనే పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. బడుల్లో మౌలిక వసతుల అభివృద్ధి, బోధనా ప్రమాణాల మెరుగుదలకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని 15 ప్రీ–ప్రైమరీ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టామని, కేజీబీవీల్లో సివిల్ వర్క్స్, తాగునీరు, గీజర్లు వంటి మౌలిక సదుపాయాలను విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. విద్యాశాఖలో పనిచేస్తున్న నలుగురు కోఆర్డినేటర్ల ఫీల్డ్ కార్యకలాపాలపై కూడా తనవైపు నుంచి నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, చిన్న సమస్యలను కూడా అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏ ఉపాధ్యాయ సంఘం అయినా తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఇవ్వవచ్చని, వాటిని సత్వరం పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పింకేశ్ కుమార్ స్పష్టం చేశారు.
జిల్లా విద్యాశాఖను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నాం
వేగవంతంగా ఉపాధ్యాయ సంఘాల వినతుల పరిశీలన
సమస్య ఉంటే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు
‘సాక్షి’తో అదనపు కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ పింకేశ్ కుమార్


