యూరియా కొరత లేదు
బచ్చన్నపేట: మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో రైతులకు సరిపడా యూరియా స్టాక్ ఉందని, కొరత లేదని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం మండలంలో పర్యటించి, యాసంగి సీజన్‌లో రైతులకు యూరియా ఎరువుల సరఫరా, పంపిణీ పరిస్థితులు, యూరియా బుకింగ్ యాప్ అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాకా, పీఏసీఎస్, ఎంజీసీ కేంద్రాలను సందర్శించి అక్కడి నిల్వలు, అమ్మకాలు, బుకింగ్ విధానం, రైతులకు అందుతున్న సేవలపై సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీఏసీఎస్ లో 1067 బ్యాగులు, ఎంజీసీలో 333 బ్యాగులు, హాకాలో 444 బ్యాగులు నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. కోతుల బెడద కారణంగా వేరుశనగ, చిరుధాన్యాలు వంటి ఇతర పంటలను సాగు చేయలేకపోతున్నామని రైతులు తెలపడంతో సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసి అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, తహసీల్దార్ రామానుజాచారి, సీఈఓ కాశ బాలస్వామి పాల్గొన్నారు.
భూసేకరణ ప్రక్రియ
వేగవంతం చేయాలి
జనగామ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకంలో భాగంగా మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన భూమి బదలాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సెర్ప్ సీఈఓ డి.దివ్య అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆమె అదనపు కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సోలార్ ప్లాంట్ల పురోగతి, స్థలాల కేటాయింపుపై సమీక్ష జరిపారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములను గుర్తించి, నిబంధనల ప్రకారం వెంటనే బదలాయింపు ప్రక్రియ చేపట్టాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ తదితరులు పాల్గొన్నారు.
సీఆర్పీ కుటుంబానికి
ఆర్థిక సాయం
పాలకుర్తి టౌన్: మండలంలోని ముత్తారం స్కూల్ కాంప్లెక్స్ పరిఽధిలో కాంట్రాక్టు ప్రాతిపదికన క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌గా విధులు నిర్వహిస్తూ గత నెల 21న గుండెపోటుతో మృతిచెందిన కొంతం సాంబయ్య కుటుంబానికి గురువారం ఎంఈఓ పోతుగంటి నర్సయ్య ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించారు. మండలంలోని ఎమ్మార్సీ సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కలిసి రూ.1,04,600 ఆర్ధిక సాయాన్ని మృతుడి కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు భూసారి అంజయ్య, ఓరుగంటి రమేశ్, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు బైకాని వెంకటయ్య, దాసు వెంకటేశ్వర్లు, ఇమ్మడి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా కొరత లేదు
యూరియా కొరత లేదు


