వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
మున్సిపల్ ఎన్నికల
నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
● వీసీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్
రాణికుముదిని
జనగామ: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు, పోలింగ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకమైన జరిగేలా చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్లు, మహేశ్వర్‌రెడ్డి, రాధాకృష్ణ ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
‘విద్యుత్ సరఫరాలో
భద్రతే కీలకం’
జనగామ: విద్యుత్ సరఫరాలో భద్రతను మరింత పటిష్టం చేసి ప్రమాదాల నివారణకు చెక్ పెట్టేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి అన్నారు. జనగామ పట్టణం పెంబర్తి సమీపంలోని ఎన్‌ఎస్‌ఆర్ భవన్‌లో బుధవారం ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆర్‌ఈసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పవర్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ భాగస్వామ్యంతో మూడు రోజుల భద్రతపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పుణే, నాగపూర్‌కు చెందిన ఇద్దరు అనుభవజ్ఞులైన ఇంజనీర్ల పర్యవేక్షణలో జిల్లాలో ఏఈ, సబ్ ఇంజనీర్లు, ఏడీఈ, ఇతర 35 మంది ఇంజనీర్లకు ప్రమాదాలకు ఏం చేయాలనే దానిపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో విద్యుత్ మరమ్మతు, కొత్త లైన్లు, ఇతర మెయింటెనెన్స్ ఇలా ప్రతి పనిలో ఒక్క ప్రమాదం కూడా జరుగకుండా ఉండేలా ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. శిక్షణ శిబిరంలో టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ గణేష్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజనల్ ఇంజనీర్లు లక్ష్మీనారాయణరెడ్డి, సారయ్య, ఆర్‌ఈసీ ప్రతినిధులు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.


