షాడోలతోనే అప్రతిష్ట
● విద్యావ్యవస్థలో కలకలం రేపుతున్న
‘సాక్షి’ కథనాలు
● శిక్షణల ఖర్చులపై విచారణకు
ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
● కొందరు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి
● మితిమీరిన జోక్యం, సమన్వయ లోపంపై అసహనం
జనగామ: జిల్లాలో విద్యాశాఖ వ్యవహారశైలిపై ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ శాఖలో పెరుగుతున్న కొందరి పెత్తనం కారణంగా ఉపాధ్యాయుల శిక్షణలు, ఇతర ట్రైనింగ్‌లకు సంబంధించిన నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ పెరుగుతోంది. డీఈఓ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ, విద్యాశాఖలో జరుగుతున్న తప్పిదాలపై నిఘా పెంచాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమాల్లో ఉత్తముల ఎంపికలో ఉపాధ్యాయ సంఘాలను విస్మరించడంపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. శిక్షణా తరగతులు, ఎన్నికల బాధ్యతలు, ఆర్పీ నియామకాలు పదేపదే కొంతమందికే కేటాయించడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉపాధ్యాయుల్లో అసహనాన్ని పెంచుతోంది. ఇటీవల పెంబర్తి ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణపై ఆర్జేడీకి ఫిర్యాదు వెళ్లడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ కమిటీ వేసినట్లు సమాచారం. మండలస్థాయి ఉన్నతాధికారిని కమిటీలో చేర్చినప్పుడు, తాము ఊహించిన ‘పదవి ప్రాధాన్యం’ రాలేదనే ఆగ్రహంతో స్వయంగా డీఈఓ కార్యాలయంలో ఫైల్‌ను విసిరేసిన ఘటన విద్యాశాఖలో నెలకొన్న పెత్తన ధోరణికి ఉదాహరణగా ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. విద్యాశాఖలో జరుగుతున్న అసమానతలు, షాడోలుగా వ్యవహరించే వ్యక్తుల జోక్యం, అధికారుల మధ్య సమన్వయ లోపం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిలో వరుసగా వెలువడుతున్న కథనాలు, ఆరోపణల నేపథ్యంలో సంబంధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ భారీగా పెరుగుతోంది.
షాడోలతోనే అప్రతిష్ట


