ప్రత్యేక శిక్షణ, హై క్లాస్ డైట్‌తో నిర్వాహకుల పెంపకం
నగర శివారుల్లో, ఫామ్‌హౌస్‌లలో భారీగా కోళ్ల ఫామ్స్
ఎంపిక నుంచి ఆహారం వరకూ అనేక జాగ్రత్తలు
జాతిని బట్టి రూ.50వేల నుంచి రూ.2 లక్షల ధర
ఔత్సాహికులు పెరగడంతో భారీగా ఏర్పడిన డిమాండ్
సంక్రాంతి పండుగ దగ్గర పడుతోంది. సంక్రాంతి అంటేనే రంగవల్లులు, పిండివంటలు, కోడిపందేలు గుర్తుకొస్తాయి. అయితే ఈ కోడిపందేల ఆటలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి. వేల మంది వీక్షించేలా ఏకంగా స్టేడియాల్లో పోటీలు నిర్వహించేందుకు ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోనూ అమ్మకానికి పందెం కోళ్లు సిద్ధమయ్యాయి. దీనిని నగరంలోని కొందరు ఔత్సాహికులు ఉపాధి మార్గంగా ఎంచుకుని నగర శివారులోని ఫామ్‌హౌస్‌లలో భారీగా పందెం పుంజులను పెంచుతున్నారు. వీటికి ప్రత్యేక శిక్షణ, హై క్లాస్ ఆహారాన్ని అందిస్తూ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలో ఔత్సాహికులు పెరగడంతో కోళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ఒక్కో పుంజు దాని జాతి, రంగును బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో కోడిపందేలు సంక్రాంతి సంస్కృతిలో ఓ భాగం. దీంతో ఈ సారి భారీ ఎత్తున పందేల నిర్వహణకు ఏర్పాటు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి స్టేడియాలను తలపించే నిర్మాణాలు దీని కోసం చేస్తున్నారంటే పందేలకు ఉన్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కుస్తీ పోటీల్లో ఉన్నట్లుగా రింగుల మధ్యలో ఇసుక పోసి.. గైడ్ ఆధ్వర్యంలో బరువులో సరితూగే పుంజులను పోటీకి ఎంపిక చేస్తుంటారు. వీటికి బ్లేడ్లు, చిరుకత్తులు కాళ్లకు కట్టి బరిలోకి దింపుతారు. బరిలో పందెం కోళ్లు కత్తులు దూస్తుంటే.. రింగు బయట జనం ఈలలు, చప్పట్లతో హుషారుగా పందేలు కాస్తూ.. గెంతులేస్తుంటారు.
శిక్షణ కోసం ఎంపిక..
పందేల్లో పాల్గొనే కోళ్లను చిన్న పిల్లగా ఉన్నప్పుడే పరిశీలించి, ఎంపిక చేసి వాటిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. అయితే సిద్ధం చేసే ప్రక్రియ కూడా ఓ పెద్ద వ్యాపారంగా మారింది. చాలా మందికి ఇదొక ఉపాధి మార్గంలా కనిపిస్తోంది. జనవరిలో జరిగే పందేల కోసం సెపె్టంబర్ నుంచే సన్నాహాలు చేస్తుంటారు. కొన్ని రకాల కోడిపుంజులను బిహార్ వంటి ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని, వాటిని పందేలకు సన్నద్ధం చేస్తుండటం విశేషం. పుంజుల ఎంపిక నుంచి వాటిని పందేలకు సిద్ధం చేయడం వరకూ ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన అంశమని, ప్రత్యర్థి కోడితో పోరు సాగించాలంటే తమ కోడికి అన్ని రకాల తరీ్ఫదులు అందిస్తామని పెంపకందారులు చెబుతున్నారు.

హై క్లాస్ డైట్..
పందెం పుంజులకు నాణ్యమైన ఆహారం అందిస్తారు. గంట్లు, చోళ్ళు, జొన్నలు, బియ్యం, రాగులు, మినప, శనగపప్పు గోధుమ మిశ్రమాన్ని తినిపిస్తారు. దీంతోపాటు జీడిపప్పు, బాదం, పిస్తా, ఎండు ఖర్జురం, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. రోజూ కోడిగుడ్డు కూడా ఇస్తారు. కొన్నిటికి బోన్‌లెస్ చికెన్, మటన్ కీమా కూడా ఆహారంగా ఇస్తారు. కొందరు మేకపాలు కూడా తాగిస్తుంటారు. తిన్నది ఒంటికి పట్టే విధంగా కసరత్తులు, మార్నింగ్ వాక్ చేయిస్తారు. పౌష్టికాహారంతో పాటుగా రోజూ ఎక్సర్‌సైజులు చేయిస్తారు. స్విమ్మింగ్, రన్నింగ్ చేసేందుకు ఏర్పాట్లుంటాయి. పందేలకు పుంజులను సిద్ధం చేయడానికి కొందరు నిపుణులు కూడా తయారయ్యారు. వీరు కోళ్లకు ఉదయాన్నే మౌత్ వాష్ చేయిస్తారు. పందెం కోడి నిర్వహణకు నెలకు ఐదు నుంచి ఆరు వేల వరకు ఖర్చు అవుతుంది.
ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు..
సంక్రాంతి బరిలో నిలబడే ప్రత్యర్థి కోడిని ఓడించడమే లక్ష్యంగా పందేం రాయుళ్లు కోడి పుంజులను కొనుగోలు చేస్తుంటారు. దేశ, విదేశాల్లోని ప్రధాన నగరాల్లో స్థిరపడి సొంత ఊరికి కోడి పందేల కోసం వచ్చేవారు ఆన్‌లైన్‌లో పుంజులను కొనుగోలు చేస్తున్నారు. ఇందు కోసం పెంపకందారులకు అధిక మొత్తంలో అడ్వాన్స్ చెల్లిస్తున్నారు. ఇక నగరాల్లో నివసించే వారూ పందేలపై ఉన్న ఆసక్తితో ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరంలోనూ పందెం కోళ్ల పెంపకం భారీ స్థాయిలో జరుగుతోంది.

రకాలు.. ఎంపికలు..
కోడిపందేనికి కొన్ని రకాల జాతులు పనికిరావు. ప్రత్యేకంగా సూచించిన వాటినే కోడిపందేలకు ఉపయోగిస్తారు. వీటిలో కనీసంగా 25 రకాల కోడిపుంజులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పందేలకు దింపుతుంటారు. ఇందులో ప్రధానంగా కాకి, నెమలి, సవళ, రసంగి, డేగ, తెల్లపర్ల, కాకిడేగ, కత్తిరాయి, జుమర్, నూరి, కగర్, డుమర్, యాకూద్, అబ్రాస్, పచ్చకాకి, సేత్వా, అసీల్ వంటివి ప్రధానంగా పోటీలో కనిపిస్తుంటాయి. దీంతోపాటు రంగులను బట్టి కోళ్లను రకాలుగా విభజిస్తారు. అంతేకాకుండా ఏ రకం కోడి ఏ కోడితో, ఏ సమయంలో పందేలకు దిగితే ఫలితాలొస్తాయో కూడా శాస్త్రబద్ధమేనని స్థానికులు చెబుతుంటారు. అన్ని రకాల శిక్షణలు పూర్తయిన తర్వాచ పెందేలకు సిద్ధం చేస్తారు. ఇలా పెరిగిన కోడి పుంజుల ధర లక్షల్లో ఉంటుంది. ఒక్కో పుంజు కనీసం రూ.50వేల నుంచి రూ.2లక్షల వరకు పలుకుతుంది.


