మహబూబ్ నగర్ జిల్లా: భార్య విడాకులు ఇచ్చిందనే కోపంలో అతడు కిరాతకుడిలా మారాడు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కొడుకు, కూతురిని కర్కశంగా హతమార్చాడు. ఆపై మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. చివరకు ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. సీఐ రాజేందర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు గ్రామానికి చెందిన చాకలి శివరాములుకు ఊట్కూరు మండలం పెద్దజట్రం గ్రామానికి చెందిన ఓ మహిళతో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. శివరాములు డ్రైవర్‌గా పనిచేస్తూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరికి కూతురు రితిక, కుమారుడు చైతన్య ఉన్నారు. అయితే దంపతులు తరచూ గొడవపడేవారు.
ఆరేళ్ల క్రితం భర్తను వదిలి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శివరాములు తీలేరుకు వచ్చాడు. ఇద్దరు పిల్లల ఆలనాపాలనా శివరాములు అమ్మానాన్న చూసేవారు. ఈ క్రమంలో దంపతులను కలపాలని రెండుసార్లు గ్రామపెద్దలు పంచాయతీ పెట్టారు. ఫలితం లేకపోవడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. గతేడాది మార్చి నెలలో కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటి నుంచి శివరాములు మనస్తాపానికి గురై ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు.
మూడు రోజుల నుంచే ప్లాన్..
తాను చనిపోతే పిల్లలు అనాథలు అవుతారని భావించిన శివరాములు మూడు రోజుల క్రితం నిర్ణయించుకున్న ఓ ప్లాన్ ప్రకారం తన ఇద్దరు పిల్లలు రితిక(8), చైతన్య(6)లను పొలం దగ్గరకు తీసుకెళ్లి రాత్రి అక్కడే నిద్రించి ఉదయం ఇంటికి వచ్చేవారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం భోజనం చేయకుండా తన పిల్లలను బైక్‌పై తీసుకెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో శివరాములు తమ్ముడి భార్య రాత్రి 8 గంటలకు ఫోన్ చేయగా రితిక అనారోగ్యంతో ఉందని మరికల్ ఆస్పత్రికి తీసుకొచ్చా.. డాక్టర్‌కు చూపించి వస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా వెళ్లి కూతురు, కుమారుడిని పొలం దగ్గర ఉన్న పశువుల కొట్టంలో పడుకోబెట్టాడు. అర్ధరాత్రి సమయంలో వారు గాఢనిద్రలో ఉండగా తాడుతో ఒక్కొక్కరి గొంతు నులిమి చంపేశాడు.
పొలం పక్కనే ఉన్న కోయిల్‌సాగర్ సాగునీటి కాల్వలో మృతదేహాలను పడేసి నీళ్లలో లోపలికి తొక్కేశాడు. పిల్లలను చంపిన తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ముందుగా పొలం దగ్గర ఉన్న గడ్డి మందు తాగాడు. ఆపై పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. అయితే సింగిల్ ఫేజ్ ఉండి అది ట్రిప్ కావడంతో షాక్ కొట్టి వదిలేసింది. మళ్లీ పశువుల కొట్టంలోకి వచ్చి గడ్డపారతో పొడుచుకొని చనిపోవాలని ప్రయత్నించాడు. అది కూడా సాధ్యం కాకపోవడంతో బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు.
అయినా చనిపోకపోవడంతో తనను బతికించాలని పక్క పొలం రైతులకు మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేశాడు. వారు వెంటనే అక్కడకుచేరుకొని చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పిల్లలను కాల్వలో నుంచి బయటకు తీశారు. శివరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. కాగా.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రితిక 4వ తరగతి, చైతన్య 1వ తరగతి చదువుతున్నారు.
డబ్బులు ఇవ్వడం లేదని.. తండ్రిని చంపిన తనయుడు
పాపన్నపేట(మెదక్): డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ కొడుకు కన్నతండ్రినే దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని సీతానగర్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన లంగడి లక్ష్యయ్య (48) వ్యవసాయంతోపాటు విద్యుత్ లైన్‌మెన్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. భార్య శేఖమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు శ్రీకాంత్ వివాహం, వ్యవసాయం నిమిత్తం కొంత అప్పులు చేశాడు. శ్రీకాంత్ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ, ఖర్చుల కోసం తరచూ తండ్రిని వేధింపులకు గురిచేసేవాడు.
ఈ క్రమంలో పలుమార్లు తండ్రీకొడుకు మధ్య గొడవలు జరిగాయి. సోమవారం రాత్రి లక్ష్మయ్య ఇంటికి రాగానే కొడుకు డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంతో శ్రీకాంత్ ముందుగా సుత్తితో తండ్రిపై దాడి చేయగా, తల్లి కొడుకు చేతి నుంచి సుత్తి లాక్కుంది. తీవ్ర ఆవే«శంతో రగిలిపోతున్న శ్రీకాంత్.. అక్కడే ఉన్న కర్రతో తండ్రి తలపై బాదాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మయ్యను చికిత్స నిమిత్తం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు.


