
బోనెస్: భువన విజయం సంస్థ, జెట్ యుకే నిర్వహించిన కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు. ఆయనకు బోనెస్‌లో ఘన స్వాగతం లభించింది. జూన్ 29న బోనెస్‌లో జరిగిన ఉపన్యాస కార్యక్రమానికి దాదాపు 500 మంది భక్తజనం హాజరయ్యారు. స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి స్వామీజీకి పూలమాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన తనయుడు అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి స్కాటిష్ కళైన బ్యాగ్‌పైప్‌ను స్థానిక కళాకారులతో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రసాద్ మంగళంపల్లి, ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ వారి సమూహం సాంప్రదాయ బద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ. శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమానికి రాజశేఖర్ జాల జెట్ యూకేతో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం, వీణా వాయిద్య ప్రదర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, ప్రజ్ఞ పిల్లల శ్లోక పఠన కార్యక్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి.
ఆ పిదప స్వామీజీ “Ego, Equality & Eternity — A Journey from Self to Supreme” అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, “అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం” అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు. ఆయన "భువన విజయం" అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు.

కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. "పుష్ప స్వాగతం నుండి ప్రసాదం చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు సంప్రదాయాలను భక్తి, ఐక్యతతో మిళితం చేసింది" అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ అభిప్రాయపడ్డారు. జీయర్ స్వామి మీద కోదండరావు అయ్యగారి వ్రాసిన పద్యాలను ప్రశంస పత్ర రూపంలో భువన విజయం సభ్యులు స్వామి వారికి బహూకరించారు.
