
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (31 బంతుల్లో 86; 6 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన మూడో యూత్ వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది.
నార్తంప్టన్ వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం వల్ల 40 ఓవర్లకు కుదించగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. ఓపెనర్లు డాకిన్స్ (61 బంతుల్లో 62; 8 ఫోర్లు, 1 సిక్స్), ఇసాక్ మొహమ్మద్ (43 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించి చక్కని ఆరంభమిచ్చారు. తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ బెన్ మయెస్ (31) ఫర్వాలేదనిపించాడు.
మిడిలార్డర్‌లో కెప్టెన్ థామస్ ర్యూ (44 బంతుల్లో 76 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో ఆఖర్లో స్కోరు వేగంగా దూసుకెళ్లింది. భారత బౌలర్లలో కనిష్క్ చౌహాన్ 3 వికెట్లు పడగొట్టగా, దీపేశ్, విహాన్, నమన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ కెప్టెన్ అభిజ్ఞాన్ (12) వికెట్‌ను కోల్పోయింది.
అయితే మరో ఓపెనర్ వైభవ్, వన్‌డౌన్‌లో వచ్చిన విహాన్ మల్హొత్రా (34 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా వైభవ్ భారి సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో టి20ను తలపించేలా 7.3 ఓవర్లలోనే జట్టు స్కోరు వంద దాటింది.
సూర్యవంశీ అవుటయ్యాక విహాన్, ఆ తర్వాత కనిష్క్ చౌహాన్ 42 బంతుల్లో 43 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో 34.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసి గెలిచింది. అలెగ్జాండర్ వేడ్‌కు 2 వికెట్లు దక్కాయి.