
భారత్ తొలిఇన్నింగ్స్ 310/5
మెరిసిన జైస్వాల్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు
రాణించిన జడేజా
యువ సారథి శుబ్‌మన్ గిల్ మరో సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత జట్టు భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరిస్తే... రవీంద్ర జడేజా కీలక ఇన్నింగ్స్‌తో తన విలువ చాటుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రెండో రోజు గిల్, జడేజా జంట ఎంతసేపు నిలుస్తుందనే దానిపైనే భారత స్కోరు ఆధారపడి ఉంది.
బర్మింగ్‌హామ్: పరాజయంతో ఇంగ్లండ్ పర్యటనను ప్రారంభించిన భారత క్రికెట్ జట్టు... రెండో టెస్టును మెరుగ్గా మొదలు పెట్టింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం మొదలైన రెండో టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (216 బంతుల్లో 114 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు.
ఈ సిరీస్‌తోనే సారథ్య బాధ్యతలు చేపట్టిన గిల్... కెప్టెన్సీ ప్రభావం తన బ్యాటింగ్‌పై ఏమాత్రం లేదని మరోసారి నిరూపించాడు. తొలి టెస్టులో సెంచరీ చేసిన గిల్... రెండో టెస్టులోనూ దాన్ని పునరావృతం చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (107 బంతుల్లో 87; 13 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. రవీంద్ర జడేజా (67 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు.
కరుణ్ నాయర్ (50 బంతుల్లో 31; 5 ఫోర్లు), రిషబ్ పంత్ (42 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 2 వికెట్లు పడగొట్టగా... కార్స్, స్టోక్స్, బషీర్ తలా ఒక వికెట్ తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న భారత జట్టు రెండో రోజు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది కీలకం.
జైస్వాల్ దూకుడు
గత మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్ జట్టు... ఈ సారి కూడా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. లీడ్స్‌తో పోల్చుకుంటే ఈ పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా ఉంటుందనే అంచనాల మధ్య తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. కేఎల్ రాహుల్ (26 బంతుల్లో 2) తొమ్మిదో ఓవర్‌లో అవుటయ్యాడు. తొలి స్పెల్‌ను కట్టుదిట్టంగా వేసిన వోక్స్‌కు ఈ వికెట్ దక్కింది.
ఈ దశలో కరుణ్ నాయర్‌తో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న ఈ జంట... ఆ తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది. గత మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన నాయర్... ఈసారి వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులో ఉన్నంతసేపు సాధికారికంగా ఆడిన అతడు కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు.
మరో ఎండ్‌లో జైస్వాల్ అలవోకగా పరుగులు రాబట్టాడు. వన్డే తరహాలో ఆడుతూ పాడుతూ... 59 బంతుల్లో 10 ఫోర్ల సహాయంతో హాఫ్‌సెంచరీ పూర్తిచేసుకున్నాడు. లంచ్ విరామానికి కాస్త ముందు కార్స్ బౌలింగ్‌లో నాయర్ అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
గిల్ సంయమనం...
రెండో సెషన్‌లో గిల్, జైస్వాల్ జోరు చూస్తే భారత్‌కు తిరుగులేనట్లు అనిపించింది. మంచి బంతులను గౌరవించిన ఈ జంట... గతి తప్పిన బంతులపై విరుచుకుపడి పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో జైస్వాల్ మరో సెంచరీ చేయడం ఖాయం అనుకుంటే... ఇంగ్లండ్ కెపె్టన్ స్టోక్స్ అతడిని ఔట్ చేసి జట్టుకు బ్రేక్ త్రూ అందించాడు. చివరి సెషన్‌లో పంత్ ఎక్కువసేపు నిలవలేకపోగా... ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు.
శార్దుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన నితీశ్ ఆరు బంతులాడి వోక్స్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో ఇంగ్లండ్ శిబిరంలో ఉత్సాహం పెరగగా... గిల్ సంయమనంతో ముందుకు సాగాడు. మరో ఎండ్ లో జడేజా అతడికి చక్కటి సహకారం అందించాడు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) జేమీ స్మిత్ (బి) స్టోక్స్ 87; రాహుల్ (బి) వోక్స్ 2; కరుణ్ నాయర్ (సి) బ్రూక్ (బి) కార్స్ 31; గిల్ (బ్యాటింగ్) 114 ; పంత్ (సి) క్రాలీ (బి) బషీర్ 25; నితీశ్ రెడ్డి (బి) వోక్స్ 1; జడేజా (బ్యాటింగ్)41; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం (85 ఓవర్లలో 5 వికెట్లకు) 310. వికెట్ల పతనం: 1–15, 2–95, 3–161, 4–208, 5–211. బౌలింగ్: వోక్స్ 21–6–59–2; కార్స్ 16–2–49–1; టంగ్ 13–0–66–0; స్టోక్స్ 15–0–58–1; బషీర్ 19–0–65–1; రూట్ 1–0–8–0.