
బార్సిలొనాలో వందేళ్ల రికార్డు బద్దలు
తుర్కియేలో భీకర కార్చిచ్చు
ఇటలీలో వడగాడ్పులకు ఇద్దరు మృతి
పారిస్‌లో ఈఫిల్ టవర్ మూసివేత
పారిస్: భానుడి భగభగలతో యూరప్ ప్రజలు తల్లడిల్లుతున్నారు. అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. మొట్టమొదటి వడగాడ్పుల తీవ్రతకు పలు చోట్ల కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తూ నివాస ప్రాంతాలను దహించి వేస్తోంది. ప్రభుత్వాలు ప్రజలకు వేడి నుంచి ఉపశమనం కలిగించే చర్యలను అమలు చేస్తున్నాయి. స్పెయిన్ రాజ«దాని బార్సిలోనాలో ఎండల తీవ్రత వందేళ్ల రికార్డును చెరిపేసింది. 1914లో ఈ నగరంలో జూన్‌లో నమోదైన సరాసరి ఉష్ణోగ్రత 26 డిగ్రీలు. తాజాగా, జూన్ 30న 37.9 డిగ్రీలతో ఈ రికార్డు బద్దలైంది.
కొండప్రాంతం, మధ్యదరా సముద్రం మధ్యలో ఉండే బార్సిలోనాలో సాధారణంగా అంతగా ఎండలుండవు. ఈ సీజన్‌లో ఈ పరిస్థితి తలకిందులైంది. స్పెయిన్‌లోని మిగతా ప్రాంతాల్లో సైతం ఎండలు మండిపోతున్నాయి. ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్‌లోనూ ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. పారిస్‌లో మంగళవారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం సుమారు 1,300 స్కూళ్లను మూసివేశారు. పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ఈఫిల్ టవర్‌ను గురువారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇటలీలోని 27 ప్రధాన నగరాలకు గాను 17 చోట్ల వడగాడ్పులు వీస్తున్నాయి.
వడగాడ్పులతో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. యూకేలోని కెంట్‌లో అత్యధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాదిలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అత్యధికంగా 35 డిగ్రీల వరకు పెరిగే ప్రమాదముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదేసమయంలో తుర్కియేలో మొదలైన కార్చిచ్చు నివాసప్రాంతాల్లోకి వేగంగా వ్యాపిస్తోంది. ప్రభుత్వం బిలెసిక్, హటాయ్, జ్మిర్ నగరాల నుంచి ముందు జాగ్రత్తగా 50 వేల మందిని ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
కొన్ని ప్రాంతాల్లో మంటలను అదుపులోకి తెచి్చనప్పటికీ విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు పనిచేయడం లేదు. గ్రీస్‌లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. వీటికి తోడు కార్చిచ్చు ప్రమాదం పొంచి ఉందని అధికారులు చియోస్, సమోస్, ఇకారియా, కితిరా, లకోనియా అట్టికా తదితర ప్రాంతాల్లో ప్రమాదహెచ్చరికలు జారీ చేశారు.