
దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) రుణ ఖాతాను ‘ఫ్రాడ్’ అకౌంట్‌గా ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వర్గీకరించనుంది. అలాగే రిజర్వ్ బ్యాంకుకి ఇచ్చే నివేదికలో సంస్థ మాజీ డైరెక్టర్ అనిల్ అంబానీ పేరును కూడా చేర్చాలని నిర్ణయించింది. జూన్ 23వ తేదీతో ఎస్‌బీఐ నుంచి ఈ మేరకు లేఖ అందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆర్‌కామ్ తెలిపింది. దీని ప్రకారం ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ.31,580 కోట్ల రుణం తీసుకున్నాయి.
ఆర్‌కామ్‌కి పంపిన లేఖ ప్రకారం.. రుణంగా తీసుకున్న నిధులను సంక్లిష్టమైన విధంగా వివిధ గ్రూప్ సంస్థలు మళ్లించినట్లు గుర్తించామని ఎస్‌బీఐ పేర్కొంది. దీనిపై జారీ చేసిన షోకాజ్ నోటీసుకి కంపెనీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్‌కామ్ ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించాలని ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ నిర్ణయించినట్లు వివరించింది.
‘ఫ్రాడ్’గా మారిస్తే..
ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ఏదైనా ఖాతాను ‘ఫ్రాడ్’గా వర్గీకరించినప్పటి నుంచి 21 రోజుల్లోగా ఆ విషయాన్ని ఆర్‌బీఐకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సీబీఐ/ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయాలి. మోసం చేసిన రుణగ్రహీతపై (ప్రమోటర్ డైరెక్టర్, ఇతరత్రా హోల్‌టైమ్ డైరెక్టర్లు సహా) కఠినచర్యలు ఉంటాయి. డిఫాల్ట్ అయిన రుణగ్రహీతలు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన అయిదేళ్ల వరకు మరే ఇతర బ్యాంకులు, డెవలప్‌మెంట్ ఫైనాన్స్ సంస్థలు, ప్రభుత్వ రంగ ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణాలు తీసుకోవడానికి ఉండదు.
ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’
ఆర్‌కామ్ స్పందన ఇదే..
ఎస్‌బీఐ నిర్ణయంపై ఆర్‌కామ్ స్పందించింది. తమ రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించడమనేది ఆర్‌బీఐ మార్గదర్శకాలు, కోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధమని స్పష్టం చేసింది. జులై 2న బ్యాంకుకు ఆర్‌కామ్ లాయర్లు ఈ మేరకు లేఖ రాశారు. ఆరోపణలపై వ్యక్తిగతంగా వివరణనిచ్చేందుకు అనిల్ అంబానీకి కనీసం అవకాశం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఎస్‌బీఐ నిర్ణయం తీసుకోవడం షాక్‌కు గురి చేసిందని, సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఆర్‌కామ్‌లోని ఇతర నాన్–ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర డైరెక్టర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసును విత్‌డ్రా చేసుకున్న ఎస్‌బీఐ, అంబానీ కూడా నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరే అయినప్పటికీ ఆయన్ను మాత్రం వేరుగా చేసి చూడటం సరికాదని లాయర్లు వివరించారు. షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చిన దాదాపు ఏడాది వరకు బ్యాంకు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తమ వివరణ సంతృప్తికరంగానే ఉందని భావించినట్లు తెలిపారు.