
యాపిల్ ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న విజన్ ప్రో మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని దొంగిలించాడని ఆరోపిస్తూ మాజీ సీనియర్ డిజైన్ ఇంజినీర్ డి లియుపై కంపెనీ దావా వేసింది. యాపిల్ నుంచి వెళ్లిపోయే చివరి రోజుల్లో లియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన సున్నితమైన ఫైళ్లను డౌన్‌లోడ్ చేశాడని, ఇంకా లాంచ్ అవ్వని డివైజ్‌కు సంబంధించిన రహస్యాలను ఇతర కంపెనీకి చేరవేసి అందులో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నించాడని యాపిల్ ఆరోపించింది.
కాలిఫోర్నియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు చేసిన దావా ప్రకారం.. ఐఫోన్ తరువాత యాపిల్ తన అత్యంత ముఖ్యమైన హార్డ్‌వేర్ లాంచ్‌గా విజన్ ప్రోను పరిగణిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో సీనియర్ డిజైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న లియు.. సున్నితమైన వివరాలను అనధికారికంగా కాపీ చేయడానికి, ఇతరులకు బదిలీ చేసేందుకు అంతర్గత డేటాను ఉపయోగించాడు. విజన్ ప్రో డిజైన్, ఫంక్షనాలిటీకి సంబంధించిన రహస్య పత్రాలను లియు పెద్ద మొత్తంలో డౌన్‌లోడ్ చేశాడు. కంపెనీ వీడిన తర్వాత లియు స్నాప్ ఇంక్‌లో చేరుతున్నట్లు తెలిసింది. ఈ రహస్య వివరాలు ఉపయోగించి తాను ఆ కంపెనీలో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నాడని ఆరోపించింది.
పోటీకి భంగం..
యాపిల్ విజన్ ప్రో డివైజ్ మార్కెట్‌లో ఇంకా విడుదల అవ్వలేదు. లియు చర్యలు యాపిల్ మేధో సంపత్తి భద్రతను దెబ్బతీయడమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న మిక్స్‌డ్ రియాలిటీ విభాగంలో కంపెనీ పోటీకి ముప్పుగా పరిణమించిందని యాపిల్ న్యాయ బృందం వాదిస్తోంది. మెటా, మైక్రోసాఫ్ట్, ఇతర టెక్ దిగ్గజాల నుంచి ఇలాంటి ఫీచర్లతో కొత్త ప్రోడక్ట్‌లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలో యాపిల్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ల్లో విజన్‌ప్రో కీలకంగా ఉందని తెలిపింది.
ఎలాంటి న్యాయపరమైన విచారణకైనా సిద్ధం
యాపిల్ దావాపై స్నాప్ ఇంక్ ఒక ప్రకటనలో స్పందిస్తూ.. లియు కంపెనీలో చేసిన తప్పుల గురించి తమకు తెలియదని పేర్కొంది. ఆయన నియామకానికి ముందు ఈ ఆరోపణల గురించి సమాచారం లేదని తెలిపింది. ఇలాంటి విషయాలను తీవ్రంగా పరిగణిస్తామని స్నాప్ ఇంక్ ప్రతినిధి ఒకరు చెప్పారు. దీనిపై ఎలాంటి న్యాయపరమైన విచారణకైనా పూర్తిగా సహకరిస్తామన్నారు.
ఇదీ చదవండి: ఇదీ చదవండి: ‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
ఏదేమైనా, కీలక హోదాల్లో సున్నితమైన పాత్రల్లో ఉన్న ఉద్యోగులు ఇతర కంపెనీలకు మారినప్పుడు, ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో యాజమాన్య డేటాను సులభంగా చేరవేసే అవకాశం ఉందనే దానిపై ఈ కేసు ఆందోళనలను లేవనెత్తుతుంది.