
నేను ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నాను. కుటుంబపోషణ కోసం చిన్నప్పటినుంచే మా నాన్న గారి సెలూన్‌లో పని చేసేవాణ్ణి. పెళ్లిళ్లలో సన్నాయి వాయించడం కోసం కూడా వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నాకు 60 ఏళ్లు. నా పిల్లలు బాగా చదువుకొని సెటిల్ అయ్యారు. నేను సెలూన్ పని మానేసి పదేళ్లవుతోంది. సన్నాయి వాయించడం కూడా ఆపేశాను. కాలక్షేపం కోసం ఇంటి దగ్గర చిన్న షాపు పెట్టుకున్నాను. నాకు ఒక సంవత్సర కాలం నుండి నేను గతంలో పెళ్లిళ్లలో వాయించిన సంగీతం, పాటలు చెవిలో మళ్లీ మళ్లీ వినపడుతున్నాయి, ముందు ఇంటి దగ్గర్లో ఏదైనా పెళ్లి అవుతుంటే అక్కడ నుండి వచ్చే శబ్దాలు, పాటలు అనుకున్నాను కానీ అని పగలు, రాత్రి, రోజంతా వినపడుతూనే ఉంటాయి. ఆ శబ్దాల వల్ల నాకు విపరీతంగా తలనొప్పి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి చెప్తే మాకే శబ్దాలూ వినపడట్లేదు. నువ్వు ఊహించుకుంటున్నావు అంటున్నారు. నాకే ఎందుకు ఇలా అవుతోంది... ఈ బాధ నుంచి నన్ను బయట పడేయండి డాక్టరు గారూ!
– గురునాథం, కరీంనగర్
మీరు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని మీ పిల్లల్ని మంచి స్థితికి తీసుకెళ్లినందుకు ముందుగా మీకు నా అభినందనలు. ఇక మీ సమస్య విషయానికి వస్తే మీకు ఉన్న కండిషన్‌ని ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అంటారు. మనం గతంలో విన్న పాటలు, శబ్దాలు అప్పుడుప్పుడు వినపడటం అందరికీ జరుగుతుంటుంది. ఉదాహరణకు పొద్దున మనకు నచ్చిన పాట వింటే అది కాసేపు అలాగే ‘మైండ్‌లో’ ప్లే అవడం, దాన్ని మనం ఎంజాయ్ చేయడం సర్వసాధారణం! కాసేపటికి వాటంతట అవే తగ్గిపోతాయి.
కానీ మీ విషయంలో ఎప్పుడో విన్న పాటలు, సంగీతం పదే పదే వినిపించడం, అవి మిగిలిన వాళ్ళకి వినపడకపోవడం, దానివల్ల డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు రావడం ఇవన్నీ ఖచ్చితంగా ఒక మానసిక సమస్యను సూచిస్తున్నాయి. ‘మ్యూజికల్ హెలూసినోసిస్’ అనేది అరుదుగా కనబడే ఒక లక్షణం. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముందుగా మీకు వినికిడి సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చెయించుకోండి. అలాంటిది ఏదైనా ఉంటే హియరింగ్ మెషిన్ వాడితే మీ సమస్య చాలావరకు తగ్గిపోతుంది.
మీ వయస్సు 60 సంవత్సరాలు కాబట్టి పెద్ద వయసులో వచ్చే డిమెన్షియా, మెదడులో ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా పరిశీలించాలి. ఇవేమీ లేవని నిర్ధారణ అయితే అప్పుడు మీకు దగ్గర్లో ఉన్న సైకియాట్రిస్ట్‌ని కలిస్తే మీకు పరీక్షలు చేసి ‘యాంటీ సైకోటిక్’ మందులు, అలాగే మీ డిప్రెషన్ తగ్గడానికి మందులు, కౌన్సెలింగ్ ఇస్తారు. వాటిని కొంతకాలం వాడితే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ధైర్యంగా ఉండండి.
(డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్ విజయవాడమీ సమస్యలు, సందేహాలు sakshifamily3@gmail.com)
(చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్‌కి సై)