
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా యువ ఆటగాడు ముషీర్ ఖాన్ ఇరగదీస్తున్నాడు. నాట్స్ సెకెండ్ 11తో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీ సహా 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ ఎమర్జింగ్ టీమ్‌తో ఇంగ్లండ్‌లో పర్యటిస్తుండగా.. ముషీర్ ముంబై టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన ముషీర్.. తొలి ఇన్నింగ్స్‌లోనే బ్యాట్‌తో, బంతితో సత్తా చాటాడు. తొలుత బ్యాటింగ్‌లో 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి, ఆతర్వాత బంతితో 'ఆరే'శాడు.
ముషీర్ ఖాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతనాడిన ఏకైక మ్యాచ్‌లో డకౌటై నిరాశపరిచాడు. ఆర్సీబీతో జరిగిన తొలి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ముషీర్ 3 బంతులు ఎదుర్కొని సుయాశ్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయితే ఇదే మ్యాచ్‌లో ముషీర్ బంతితో పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 27 పరుగులిచ్చి మయాంక్ అగర్వాల్ వికెట పడగొట్టాడు.
20 ఏళ్ల ముషీర్ ఖాన్ టీమిండియా అప్ కమింగ్ మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు. ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్ సెంచరీ కూడా ఉంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముషీర్ బౌలర్‌గానూ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. ముషీర్ 2024 అండర్-19 వరల్డ్‌కప్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో ముషీర్ రెండు సెంచరీలు చేశాడు. 2024 రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన ముషీర్.. ముంబై తరఫున రంజీ ఫైనల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.