
శుక్రవారం అలాస్కాలో ట్రంప్, పుతిన్ కలిసినప్పుడు చరిత్రలో నేను చదువుకున్న ‘యాల్టా’ సమావేశమే నాకు గుర్తుకొచ్చింది!
నేను పుట్టటానికి 33 ఏళ్ల ముందు జరిగిన సమావేశం అది. అప్పటికి పుతిన్ పుట్టలేదు. ట్రంప్ కూడా పుట్టలేదు. యాల్టా సమావేశం జరిగిన ఏడాదికి ట్రంప్, ఏడేళ్లకు పుతిన్ పుట్టారు.
‘యాల్టా’ ఇప్పుడు ఉక్రెయిన్‌లో ఉంది. అప్పట్లో సోవియెట్ యూనియన్‌లో ఉంది. యాల్టాకు పోలికగా ఇప్పుడు అలాస్కా నాకు గుర్తుకు రావటానికి తగినన్ని కారణాలే ఉన్నాయి.
రెండో ప్రపంచ యుద్ధం మధ్యలో యాల్టా సమావేశం జరిగింది. ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో అలాస్కా సమావేశం జరిగింది.
యాల్టా సమావేశం రూజ్‌వెల్ట్, స్టాలిన్, చర్చిల్‌ల మధ్య జరిగింది. అలాస్కా సమావేశం ట్రంప్, పుతిన్‌ల మధ్య జరిగింది.
యాల్టాలో రూజ్‌వెల్ట్, చర్చిల్ కలిసి స్టాలిన్‌కు కొన్ని దేశాల భూభాగాలను పంచి పెట్టారు! ఇప్పుడు ట్రంప్ కూడా ఉక్రెయిన్‌లో కొన్ని ప్రాంతాలను నా చేత ఇప్పించేందుకు ట్రంప్‌కు మాట ఇచ్చి ఉంటారా?!
అలాస్కాకు, యాల్టాకు అన్నిటికన్నా ముఖ్యమైన పోలిక... యాల్టా సమావేశం ఫిబ్రవరిలో జరగటం! ఆ తర్వాత 77 ఏళ్లకు ఉక్రెయిన్ మీదకు రష్యా దురాక్రమణ కూడా ఫిబ్రవరిలోనే ప్రారంభం అవటం!
శనివారం ఉదయం ట్రంప్ పర్సనల్ సెక్రెటరీ నటాలీ ఫోన్ చేసి, ‘‘ప్రెసిడెంట్ ట్రంప్ హ్యాపీగా లేరు...’’ అన్నారు!
సోమవారం వాషింగ్టన్‌లో ట్రంప్‌కూ, నాకూ మధ్య జరగబోయే సమావేశంలో ట్రంప్ తనేమి చెప్పబోతారో, దాన్నే ముందుగా నటాలీ చేత నాకు చెప్పించటానికి ట్రంప్ ఫోన్ చేయించి ఉంటారని నాకు అర్థమైంది.
‘‘ట్రంప్ ఒక్కరేనా, ప్రెసిడెంట్ పుతిన్ కూడా హ్యాపీగా లేరా?’’ అన్నాను.
నా వ్యంగ్యాన్ని ఆమె సరిగానే అర్థం చేసుకున్నప్పటికీ, అదేమీ పట్టనట్లు ‘‘మీరూ, పుతిన్ ఓపెన్ డోర్స్ మీటింగ్‌లో కూర్చుంటే బాగుంటుందని ప్రెసిడెంట్ ట్రంప్ భావిస్తున్నారు...’’ అన్నారు.
‘‘ఓపెన్ ఆన్సర్లు లేకుండా, ఓపెన్ డోర్ మీటింగులతో ఏమౌతుంది చెప్పండి మిసెస్ నటాలీ?’’ అన్నాను.
నటాలీ కొద్ది క్షణాలు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత, ‘‘మూడో ప్రపంచ యుద్ధం కనుక మొదలైతే ఇక అదే చివరిది అవుతుందని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు’’ అన్నారు!!
మూడో ప్రపంచ యుద్ధం వస్తే అదే ఆఖరి యుద్ధం అవుతుందని జోస్యంలా చెప్పటం కాకుండా, మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఈ భూగోళానికే పెద్ద విపత్తు అని ఒక జాగ్రత్తలా ఎవరూ ఎందుకు మాట్లాడరు!
‘‘మిసెస్ నటాలీ! రోజంతా మీరు ప్రెసిడెంట్ పక్కనే ఉంటారని, ఇంటర్నెట్‌లో ప్రెసిడెంట్ ట్రంప్‌పై వచ్చే ప్రశంసాపూర్వకమైన కథనాలను ఆయనకు అందిస్తుంటారని విన్నాను. ట్రంప్ కనుక పుతిన్‌తో, ‘మీరే ముందు యుద్ధం ఆపేయండి’ అని ఒక్క మాట అనగలిగినా మా వైపు నుండి కూడా ఒక ప్రశంసాపూర్వకమైన కథనం మీకు లభ్యమౌతుంది...’’ అన్నాను, నవ్వుతూ.
ఆ మాటకు తనూ నవ్వారు.
ఇద్దరం ఒకప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కెరీర్‌లో ఉన్నవాళ్లం. ఆ మ్యాజిక్ ఏదో మా మాటల్లో పనిచేసినట్లుంది. ప్రెసిడెంట్‌కు సెక్రెటరీగా కాకుండా, ఒక కో–ఆర్టిస్ట్‌గా నాతో సైన్ ఆఫ్ అయ్యారు నటాలీ.
అలాస్కా సమావేశం జరిగినప్పటికీ కీవ్‌ను ఆక్రమించేందుకు రష్యా ఇంకా ఇంకా దగ్గరికి వస్తూనే ఉంది!
రేపు ట్రంప్‌తో నా మీటింగ్ తర్వాత కూడా రష్యాకు నేను ఒకటే చెబుతాను.
‘‘మీరు మాపై దాడికి వచ్చినప్పుడు మీరు మా ముఖాలను చూస్తారు. మా వీపులను కాదు, మా ముఖాలను!’’ అని చెప్పిందే చెబుతాను.