
ప్రపంచంలో ఎన్నో భారీ కట్టడాలు ఉన్నాయి. వీటిలో ప్రజల సామూహిక అవసరాల కోసం నిర్మించినవి కొన్ని, ప్రైవేటు వ్యక్తుల విలాసాల కోసం నిర్మించుకున్నవి మరికొన్ని. మనుషుల సంచారం ఉన్నప్పుడే ఎంతటి కట్టడానికైనా కళాకాంతులు ఉంటాయి. మనిషి అలికిడైనా లేని కట్టడాలు దయ్యాల కొంపలను తలపిస్తాయి. ఎంతో వ్యయప్రయాసలతో నిర్మించినా, మనిషి అలికిడి లేకపోవడం వల్ల కళ తప్పిన కొన్ని నిర్జన నిర్మాణాల గురించి తెలుసుకుందాం...
ఆర్ఫియమ్ థియేటర్
ప్రపంచంలో ఇంకా సినిమా ప్రభావం మొదలవక ముందు నాటక ప్రదర్శనల కోసం నిర్మించిన రంగస్థల కేంద్రం ‘ఆర్ఫియమ్ థియేటర్’. ఇది అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం న్యూబెడ్‌ఫోర్డ్‌లో ఉంది. దీనిని న్యూబెడ్‌ఫోర్డ్‌లోని ఫ్రెంచ్ షార్ప్‌షూటర్స్ క్లబ్ నిర్మించింది. తర్వాత దీనిని బోస్టన్‌కు చెందిన ఆర్ఫియమ్ సర్క్యూట్‌కు లీజుకిచ్చింది.
సరిగా ‘టైటానిక్’ ఓడ మునిగిపోయిన రోజునే– 1912 ఏప్రిల్ 15న ఈ థియేటర్ ప్రారంభమైంది. నాటి నుంచి యాభయ్యేళ్ల పాటు 1962 వరకు ఇక్కడ విరివిగా నాటక ప్రదర్శనలు జరిగేవి. సినిమా, టెలివిజన్ ప్రభావం పెరగడంతో 1959 నాటికే దీని ప్రాభవం క్షీణించింది. నష్టాలతో నడపలేక ‘ఆర్ఫియమ్’ యాజమాన్యం 1962లో దీనిని మూసేసింది. అప్పటి నుంచి ఈ కట్టడం జనసంచారం లేక బోసిపోయి, శిథిలావస్థకు చేరుకుంది.
సాథోర్న్ యూనిక్ టవర్
దాదాపు ముప్పయ్యేళ్ల కిందట ‘బూమ్’ బుడగ విస్తరించినప్పుడు థాయ్‌లండ్ ఆర్థిక వ్యవస్థ కూడా కాసుల గలగలలతో కళకళలాడేది. స్థిర చరాస్తి రంగాల్లోకి పెట్టుబడుల ప్రవాహం ఉద్ధృతంగా సాగేది. రియల్ ఎస్టేట్ రంగం మూడు వెంచర్లు, ఆరు అపార్ట్‌మెంట్లలా ఒక వెలుగు వెలిగేది. ఆ కాలంలోనే బ్యాంకాక్‌లో ఈ నలభై అంతస్తుల కట్టడం రూపుదిద్దుకుంది. బ్యాంకాక్ నగరం నడిబొడ్డున చావోఫ్రాయా నదికి చేరువలో భారీ స్థాయిలో సంపన్నుల విలాసాలకు అనువుగా ఈ అపార్ట్‌మెంట్ భవన నిర్మాణాన్ని తలపెట్టారు.
నిర్మాణం ఇంకా కొనసాగుతున్న దశలోనే ‘బూమ్’ బుడగ బద్దలైంది. అపార్ట్‌మెంట్ నిర్మాణ కార్యక్రమానికి నిధులు నిలిచిపోయాయి. సాథోర్న్ యూనిక్ కంపెనీ ఈ భవన నిర్మాణ కార్యక్రమాన్ని సిఫ్యా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. డబ్బులు ముట్టకపోవడంతో సిఫ్యా కన్‌స్ట్రక్షన్ కంపెనీ 1997లో నిర్మాణ పనులను మధ్యలోనే నిలిపివేసింది. ఆ తర్వాత దీనిని పూర్తి చేయడానికి సాథోర్న్ యూనిక్ కంపెనీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, అవేవీ సఫలం కాలేదు. ఫలితంగా ఈ కట్టడం కళతప్పి, ‘ఘోస్ట్ టవర్’గా మిగిలింది.
వాన్లీ యూఎఫ్‌ఓ విలేజ్
అప్పుడపుడు ఆకాశంలో ‘అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్స్’ (యూఎఫ్‌ఓలు) కనిపించినట్లుగా వార్తలు వస్తుంటాయి. యూఎఫ్‌ఓలను నేల మీద ఉండగా చూసినవాళ్లు ఎవరూ లేరు. అలాంటిది యూఎఫ్‌ఓలో బస చేసినవారు ఉండటమనే ప్రశ్నే లేదు. యూఎఫ్‌ఓలు నేల మీదకు వస్తే, వాటిని చూడాలని, కుదిరితే వాటిలో కాలం గడపాలని కోరుకునేవారు తక్కువేమీ కాదు. అలాంటివారి కోరిక తీర్చాలనే ఉద్దేశంతోనే తైవాన్‌కు చెందిన హుంగ్ కువో గ్రూప్ రాజధాని తైపీ నగరానికి చేరువలోని సాంఝీలో యూఎఫ్‌లో ఆకారంలో నిర్మించిన భవంతులతో రిసార్ట్ నిర్మాణం తలపెట్టింది.
ఈ రిసార్ట్‌లో యూఎఫ్‌లోను తలపించేలా గూళ్లలాంటి చిన్న చిన్న ఇళ్లను నిర్మించడానికి 1978లో పనులు ప్రారంభించింది. కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తిచేసింది కూడా! ఆర్థిక ఇబ్బందులతో పాటు ఈ ప్రదేశంలో ఆత్మహత్యలు, వాహన ప్రమాదాలు వంటి వరుస దుస్సంఘటనలు ఎదురవడంతో 1980లోనే ఈ నిర్మాణాన్ని నిలిపివేసింది. అప్పటి నుంచి ఇక్కడ యూఎఫ్‌ఓ ఆకారంలో నిర్మించిన ఇళ్లన్నీ ఖాళీగా మిగలడంతో పాడుబడిన దశకు చేరుకున్నాయి. ఈ కట్టడాలపై అనేక వదంతులు ప్రచారంలో ఉండటంతో స్థానకులు సైతం ఇక్కడకు రావడానికి భయపడతారు.
ర్యుగ్యాంగ్ హోటల్
ఉత్తర కొరియా రాజధాని ప్యోంగ్‌యాంగ్ నగరం నడిబొడ్డున శిఖరంలా నిలిచి కనిపించే ఈ హోటల్‌లో ఇప్పటి వరకు అతిథులెవరూ అడుగుపెట్టలేదు. ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ ఇల్ సుంగ్ హయాంలో దేశానికే తలమానికంలా నిలిచేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ నూటైదు అంతస్తుల హోటల్ భవంతి నిర్మాణాన్ని 1987లో ప్రారంభించారు.
దేశానికి తరచుగా ఆర్థిక కష్టాలు ఎదురవడంతో ఈ హోటల్ నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూ వచ్చాయి. కుంటుతూ కుంటుతూనే ఇందులో మూడువేల గదులను, ప్రతి గదికి బయటివైపు మూడువేల గాజు పలకలను కళ్లు జిగేల్‌మనిపించేలా నిర్మించారు. ఇందులో ఐదు రివాల్వింగ్ రెస్టరెంట్లను కూడా నిర్మించారు.
దీర్ఘకాలం పనులు నిలిచిపోయాక, కిమ్ జాంగ్ ఉన్ పాలన మొదలయ్యాక అర్ధాంతరంగా నిలిచిపోయిన దీని పనులు మళ్లీ మొదలయ్యాయి. పాతికేళ్ల కిందట మొదలైన ఆ పనుల్లో భాగంగా హోటల్ బయటివైపు నిర్మాణాన్ని కూడా పూర్తిచేశారు. అయితే, ఈ హోటల్ కార్యకలాపాలేవీ ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పటికీ చక్కగా నివాసయోగ్యంగా ఉన్నా, మనిషి అలికిడి లేకుండా మిగిలిన ఈ హోటల్‌ను ‘హోటల్ ఆఫ్ డూమ్’గా అభివర్ణిస్తూ పాశ్చాత్య మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.
సిటీహాల్ సబ్‌వే స్టేషన్
ఇది అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్థానిక రైళ్ల రాకపోకల కోసం నిర్మించిన భూగర్భ రైల్వేస్టేషన్. దీనిని 1904లో నిర్మించారు. అప్పట్లో ఇది ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించేది. వంపు తిరిగిన దీని ప్లాట్‌ఫామ్ కారణంగా పొడవాటి రైళ్లు నిలిపేందుకు సానుకూలత లేకపోవడమే దీని లోపం. జనాభాకు తగినట్లుగా రైళ్లకు బోగీలు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో 1945లోనే ఈ స్టేషన్ మూతబడింది.
నాటి నుంచి ఇది నిర్మానుష్యంగా మిగిలింది. ఈ రైల్వేస్టేషన్‌కు అప్పట్లో జార్జ్ లూయిస్ హీన్స్, క్రిస్టఫర్ గ్రాంట్ లా ఫార్జ్ అనే ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్‌లు రూపకల్పన చేశారు. పైకప్పుకు వేలాడే ఇత్తడి షాండ్లియర్లు, నున్నని రాతి పలకలతో నిర్మించిన గచ్చు, విశాలమైన ప్రవేశమార్గం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆనాటి రవాణా వ్యవస్థ వైభవానికి ఆనవాలుగా నిలిచి ఉన్నాయి. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాక కళ తప్పిన ఈ స్టేషన్ ఇప్పుడు కొంత శిథిలావస్థకు చేరుకుంది.
(చదవండి: