
యువత వ్యోమగాములుగా మారాలి
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
న్యూఢిల్లీ: అంతరిక్ష రహస్యాలు ఛేదించడమే లక్ష్యంగా మరింత లోతైన ప్రయోగాలకు సిద్ధం కావాలని స్పేస్ సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రయోగాలు మానవాళి భవిష్యత్తుకు ఉపకరిస్తాయని తెలిపారు. డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ‘జాతీయ అంతరిక్ష దినం’సందర్భంగా మోదీ శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు.
భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష మిషన్ల కోసం ఇప్పటినుంచే వ్యోమగాముల బృందాన్ని సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. చంద్రుడిపైకి, అంగారకుడిపైకి చేరుకున్నామని, ఇకపై అంతరిక్షం లోతుల్లోకి వెళ్లాల్సి ఉందని అన్నారు.
స్పేస్ సెక్టార్‌లో ఒక విజయం తర్వాత మరో విజయం సాధించడం మన దేశానికి, మన సైంటిస్టులకు సహజమైన అలవాటుగా మారిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తంచేశారు. మన విశ్వానికి సరిహద్దు అంటూ లేదని, మన ప్రయోగాల్లోనూ సరిహద్దులు ఉండకూడదని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సెమీ–క్రయోజెనిక్ ఇంజన్ల వంటి అధునాతన సాంకేతికతను మనం సాధించామని తెలిపారు.