ఇకనైనా కళ్లు తెరవకపోతే....నిలువునా మింగేస్తుంది! | Health Risks of Plastic Use: How BPA & Melamine Harm Your Body | Sakshi
Sakshi News home page

ఇకనైనా కళ్లు తెరవకపోతే....నిలువునా మింగేస్తుంది!

Sep 30 2025 10:04 AM | Updated on Sep 30 2025 1:04 PM

How Does Plastic Affect Human Health? environmental contamination

నిజం చెప్పాలంటే మనమిప్పుడు ప్లాస్టిక్‌ మహాసముద్రం మధ్యలో జీవిస్తున్నాం. ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చుగానీ... మన రోజువారీ కార్యకలాపాల్లో చూసుకుంటే  పొద్దున్నే బ్రష్, స్నానంలో మగ్, రుద్దుకునే సబ్బు తాలూకు సోప్‌కేస్‌ అన్నీ ప్లాస్టిక్‌వే. ఇక ఆఫీసుకు వచ్చాక తాగే మొదటిచాయ్‌ నుంచి బయటకువెళ్లినప్పుడు చాయ్‌ అమ్మే వ్యక్తి ఇచ్చే టీ వరకు చాలావరకు ప్లాస్టిక్కే. గతంలోని స్టీల్‌ క్యారియర్‌ స్థానంలో ఇప్పుడు చాలా లంచ్‌బాక్సులు ప్లాస్టిక్‌వే. ఇలా చూసుకుంటే మనం వాడే నిత్యజీవిత ఉపకరణాల్లో ప్రతి ఐదింటిలో కనీసం మూడైనా ప్లాస్టిక్‌వే ఉంటాయి. కానీ ఈ ప్లాస్టిక్‌ సముద్రమిప్పుడు సునామీగా మారి మన ఆరోగ్యాలను  దెబ్బతీస్తోంది. అది ఏయే విధంగా మన ఆరోగ్యాలను కబళిస్తోందీ, ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించలేక పోయినా కనీసం దాన్ని రీ–సైకిల్‌ చేసేందుకు వీలుగా  ఉండే వాటిని వాడాలనే అవగాహన కోసమే ఈ కథనం. మన ఇళ్లలో చెత్త ఊడ్చాక దాన్ని ఎత్తడానికీ ప్లాస్టిక్‌ చేటనే వాడతాం. అయితే ఇలాంటి ఉపకరణాలతో అప్పటికప్పుడు ఆరోగ్యానికి వచ్చే ప్రమాదమేమీ పెద్దగా లేకపోయినప్పటికీ... వేడి వేడి ఆహారాన్నినిల్వ చేయడానికి ఉపయోగించేప్లాస్టిక్‌ ఉపకరణాలతో మాత్రం ఆరోగ్యాలకు ఎంతో నష్టం చేకూరుతుంది. ఆ  ప్లాస్టిక్‌ల కారణంగా ఆరోగ్యానికి జరిగే చేటు ఏమిటో, దాన్ని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

ప్లాస్టిక్‌ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... అందునా మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్‌స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంతో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని అధ్యయనాల్లో తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం జరుగుతాయి. అందువల్ల వీలైనంత మేరకు ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించుకోవడం మంచిది.

ప్లాస్టిక్‌తో ఆరోగ్యానికి హాని ఎందుకు..? 
ఇందుకు ఓ ఉదాహరణగా... ఆహారం పెట్టుకోడానికి గతంలో వాడే స్టీలుకు బదులు ప్లాస్టిక్‌ ఉపకరణాలను వాడుతున్నప్పుడు మన ఆరోగ్యానికి కలిగే హాని ఏమిటో తెలుసుకుందాం. ఆహారం ప్లాస్టిక్‌ బాక్స్‌లలో నిల్వ ఉంచి తీసుకుంటున్నప్పుడు మనం దాన్ని తిన్నప్పుడల్లా బాక్స్‌ తాలూకు ΄్లాస్టిక్‌ పదార్థాలూ కొద్దికొద్ది మోతాదుల్లో ఆహారంతోపాటు మన దేహంలోకి వెళ్తుంటాయి. ఆహారంతో పాటు ప్లాస్టిక్‌ మన శరీరంలోకి వెళ్లి, మన దేహంలోకి ఇంకిపోయే ప్రక్రియను ‘లీచింగ్‌’ అంటారు. 

చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌ : ఐశ్వర్యా డాజ్లింగ్‌ లుక్‌ వెనుకున్న సీక్రెట్‌ ఇదే!

ఈ ప్రక్రియ ఎక్కువగా ఉండేదెప్పుడు..? 
లీచింగ్‌ ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్న పరిస్థితులివే... 
ఆహారం ఎంత వేడిగా ఉంటే... అంతగా ప్లాస్టిక్‌ మన కడుపులోకి ప్రవేశిస్తుంది. ∙అదే ఆహారంలో కొవ్వులు, ఉప్పు ఉన్నప్పుడు లీచింగ్‌ మరింత పెరుగుతుంది. 
మనం తీసుకునే ఆహారంలో అసిడిక్‌ వస్తువులు అంటే చింతపండు, సాంబార్‌ వంటి పులుపు వస్తువులు ఉంటే... మన ప్లాస్టిక్‌ కంటెయినర్‌ నుంచి మన దేహంలోకి  ప్లాస్టిక్‌ ఎక్కువ మోతాదుల్లో కలుస్తుంటుంది.

ప్లాస్టిక్‌ బౌల్‌లో ఆహారాలు ఎందుకు పెట్టకూడదంటే...?!  
ఈ మధ్యకాలంలో మనం అందంగా కనిపించే ప్లాస్టిక్‌ బౌల్స్‌లో కూరలూ, వేడి వేడి పులుసు వంటి ఆహారాలను ఉంచి, వాటిని డైనింగ్‌ టేబుల్‌ మీద అలంకరించి వాటిల్లోంచే అన్నం, కూరలు వడ్డించడాన్ని చూస్తున్నాం.

సాధారణంగా ఈ కూరలు పెట్టుకునే బౌల్స్‌ను ‘మెలమెన్‌’ అనే ప్లాస్టిక్‌ వంటి పదార్థంతో తమారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ఆ ప్లాస్టిక్‌లోని మెలమైన్‌... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి వెళ్తుంది. ఇలా దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. ఈ విషయం ‘జామా ఇంటర్నల్‌ మెడిసిన్‌’ జర్నల్‌లోనూ ప్రచురిత మైంది. 

ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్‌ బౌల్స్‌లో నూడుల్స్‌ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలమైన్‌ బౌల్స్‌లో తిన్నవారి మూత్రంలో మెలమైన్‌ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. దీంతో వారిలో కిడ్నీ ఫెయిల్యూర్‌ వంటి ముప్పుతో పాటు... క్యాన్సర్‌ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మెలమైన్‌ బౌల్‌లో పెట్టి ఏ ఆహారాన్నీ మైక్రోవేవ్‌ ఒవెన్‌లోఉంచి వేడిచేయకూడదని అమెరికన్‌ సంస్థ ఎఫ్‌డీఏ కూడా గట్టిగా సిఫార్సు చేస్తోంది. ఈ ప్లాస్టిక్‌ ప్రభావం ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్‌ స్రావంపై ఉంటుందనీ, దీనివల్ల ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చని తేలింది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలామందిలో డయాబెటిస్‌ రిస్క్‌ పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే  మరో అధ్యయనంలోనూ తేలింది.

స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్‌ వంటి క్యాన్సర్‌ రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్‌ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్‌ మారి΄ోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అలై్జమర్స్‌ వంటివి కూడా ఎక్కువగా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్లాస్టిక్‌ ఉపయోగం కారణంగా ఇలా పలు రకాలుగా ఆరోగ్యంపై అనేక దుష్ప్రభావాలు పడుతున్నాయి. అందుకే కూరలు, పులుసులు నిల్వ చేసుకునేందుకు  ప్లాస్టిక్‌ బౌల్స్‌లో కాకుండా పింగాణీ బౌల్స్‌ వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు.

మరో సరికొత్త అధ్యయన ఫలితమిలా... 
పిల్లలు పాలు తాగడానికి ఉపయోగించే  పాలపీకలు మొదలుకొని, వాళ్లు ఆడుకునే ఆటవస్తువుల వరకు ప్లాస్టిక్‌తో తయారైనవి కాస్తా... చాలాకాలం తర్వాత... అంటే ఆ చిన్నారులే పెరిగి కాస్త పెద్దయ్యాక (అంటే పెద్దపిల్లలుగా ఉన్నప్పుడూ, వాళ్ల కౌమార  ప్రాయంలో/అడాలసెంట్‌ వయసులో) వాళ్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపుతాయంటూ వేలాది తల్లులూ, పిల్లలపై నిర్వహించిన ఓ అధ్యయనం తెలుపుతోంది. అలా ఆ ప్లాస్టిక్‌ వస్తువులు వాడిన ఆ పిల్లల పాటు తల్లుల్లో సైతం మొదట స్థూలకాయం... దాని ప్రభావంతో గుండె జబ్బులు, ఆస్తమా, సంతానలేమి వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయంటూ ఆ అధ్యయనం పేర్కొంటోంది. ఈ ఫలితాలు ప్రముఖ హెల్త్‌ జర్నల్‌ ‘ల్యాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి.

ప్లాస్టిక్‌ బాటిలో ఉంచిన నీళ్లు తాగచ్చా..?
మరో పరిశోధన తాలూకు ఫలితాలివి. ఇటీవల చాలామంది నీళ్లబాటిల్‌ కొని దాన్ని వాడుతూ ఉంటారు. ఇలా ఓ బాటిల్లో వారం పాటు ఉంచిన నీళ్లు తాగవచ్చా అనే అంశంపై ఇటీవల కొందరు పరిశోధకులు ఓ అధ్యయనం నిర్వహించారు.  ఈ అధ్యయనంలో తేలిన అంశమేమిటంటే... ఇలా నీళ్లు నిల్వ ఉంచినప్పుడు ప్లాస్టిక్‌ కొద్దికొద్ది మోతాదుల్లో కలవడం (లీచ్‌ కావడం) వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందనీ, అలాగే వారం పాటు ఉంచి నీళ్లలో బ్యాక్టీరియా పెరగడంతో కడుపులో ఇబ్బందిగా ఉండటం, కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు రావడమేగాక...కాస్త అరుదుగా అలాంటి కొందరిలో అది ప్రాణాపాయానికీ దారి తీయవచ్చంటూ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇలా బ్యాక్టీరియా పెరగడమన్నది కేవలం నీళ్లలో జరిగినా, జరగకపోయినా... బాటిల్‌ తాలూకు మూతలో సైతం బ్యాక్టీరియా/మౌల్డ్‌ (నాచు వంటి పెరుగుదల) పెరగవచ్చంటూ వారు హెచ్చరిస్తున్నారు.  

అసలు ప్లాస్టిక్‌ అంటే ఏమిటంటే...? 
ప్లాస్టిక్‌ వస్తువులు, ఉపకరణాలు ప్రధానంగా బైస్ఫినాల్‌ ఏ (బీపీఏ) అనే పదార్థంతో తయారవుతాయి. ∙కొన్ని సందర్భాల్లో థాలేట్‌ అనే పదార్థంలోనూ ప్లాస్టిక్‌ ఉపకరణాలను తయారుచేస్తారు.  మనం ఆహారం, తిను బండారాలూ, ఇతరత్రా ద్రవపదార్థాలను నిల్వ ఉంచేందుకు  మనం రోజువారీ ఉపయోగించే ప్లాస్టిక్‌తో తయారైన ఉపకరణాలన్నీ (యుటెన్సిల్స్‌) ప్రధానంగా బైస్ఫినాల్‌ ఏ (బీపీఏ) లేదా థాలేట్‌తోనే తయారవుతాయి.

చదవండి: ఈ టిప్స్‌ పాటిస్తే పండగ వేళ మెరిసిపోవడం ఖాయం!

  • బీపీఏలతో ఆరోగ్యంపై దుష్ప్రభావాలు...  
    ప్లాస్టిక్‌ బాక్స్‌లలో ఉంచే ఆహారం వల్ల మన ఆరోగ్యంపై చాలా రకాల దుష్ప్రభావాలు పడతాయి. వాటిలో కొన్ని... 

  • ప్లాస్టిక్‌ కలిసిన ఆహారంతో హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌పై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మహిళల్లో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యంలో తేడాలు వచ్చిగర్భధారణ సమస్యలు వచ్చే అవకాశాలెక్కువ. 

  • పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గడం, పురుష సంబంధ హార్మోన్ల స్రావం తగ్గడం.
    వైద్యపరీక్షల్లో మూత్రంలో ప్లాస్టిక్‌ పాళ్లు పెరిగినట్లుగా రిపోర్టులు వచ్చిన చాలామందిలో డయాబెటిస్‌ కేసులు పెరుగుతున్నట్లుగా ఒక అధ్యయనంలో తేలింది. 

  • ప్లాస్టిక్‌ యుటెన్సిల్స్‌లో ఆహారం తీసుకునేవారిలో స్థూలకాయం వస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. 

  • రొమ్ము క్యాన్సర్‌ వంటి క్యాన్సర్‌ ముప్పు చాలా ఎక్కువ. 

  • ప్లాస్టిక్‌ కంటెయినర్లలో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్‌ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అల్జైమర్స్‌ వ్యాధి వంటివి కూడా ఎక్కువగా పెరుగుతోంది.

బీపీఏలతో తయారయ్యే ఉపకరణాలివి... 
పిల్లలకు ఉపయోగించే పాలపీకలు,
వాటర్‌బాటిళ్లు, ∙లంచ్‌బాక్స్‌లు,
సీడీలు, డీవీడీలు,
కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలు.

ప్లాస్టిక్‌తో అనర్థాల నివారణకు కొన్ని  సూచనల గురించి తెలుసుకోవాలంటే  చదవండి 

బరువు తగ్గడం కష్టంగా ఉందా? షాకింగ్‌ రీజన్‌ ఇదే కావచ్చు!

డాక్టర్‌ శివరాజు సీనియర్‌ ఫిజీషియన్‌ 
నిర్వహణ:  యాసీన్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement