
హైదరాబాద్: ప్రజలంతా ఫిట్‌నెస్ శిక్షణను ఎంత సీరియస్‌గా తీసుకుంటారో, ముందస్తు వైద్య పరీక్షలు కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలని ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు పిలుపునిచ్చారు. క్రీడల్లో గానీ, రోజువారీ జీవితంలోగానీ అవి అత్యంత అవసరమైనవని ఆమె చెప్పారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ తొలి వార్షికోత్సవంలో ఆమె మాట్లాడారు. మంచి ఆరోగ్య స్వేచ్ఛ అనే స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో తన జీవనయానంలో క్రమశిక్షణ, ఇబ్బందులను అధిగమించేందుకు త్వరగా స్పందించాల్సిన అవసరం లాంటి విషయాలు పంచుకున్నారు.
జీవీకే కుటుంబానికి చెందిన కేశవరెడ్డి, వీణారెడ్డిలతో జరిగిన ఒక చర్చ.. సాధారణ విషయాల నుంచి సీరియస్ అంశాలవైపు మళ్లింది. ఒలింపిక్ పతకం సాధించడం కంటే ఐస్ క్రీం తినకుండా ఉండడం కష్టమా అన్నప్పుడు.. సింధు నవ్వేసింది. తర్వాత మాట్లాడుతూ, “పతకాలు సాధించడం కష్టమే. కానీ, ఐస్ క్రీం వద్దనడం ఇంకా కష్టం. కానీ క్రమశిక్షణ, కోలుకోవడం, ముందస్తు సంరక్షణల వల్లే నేను ఇంకా ఆడగలుగుతున్నాను. నిలకడ అనేది చాలా ముఖ్యం. గాయాలు కాకుండా చూసుకోవడండ, అనారోగ్యం రాకుండా జాగ్రత్త పడడంతోనే మనం ఎక్కువకాలం ఆటలో ఉండగలం” అని చెప్పారు.
తన సొంత అనుభవాల గురించి సింధు వివరిస్తూ శిక్షణలాగే త్వరగా కోలుకోవడం, వెంటనే స్పందించడం ఎందుకు ముఖ్యమో ఇలా చెప్పారు. “మనమంతా క్రీడల్లో ఫిట్‌నెస్ పరీక్షలను గౌరవిస్తాం. మరి జీవితంలో వైద్యపరీక్షలంటే ఎందుకు భయపడతాం? మనం ఎంత కష్టపడి శిక్షణ తీసుకుంటామన్నది కాదు, ఎప్పుడు ముందుకెళ్లాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల సామర్థ్యం పెరుగుతుంది. కానీ మహిళలకు వ్యాధుల నివారణ చాలా కీలకం. మీరు పెద్దస్థాయిలో పోటీ పడుతున్నా, లేదా చురుగ్గా ఉన్నా ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవాలి. దానివల్ల ఏమైనా సమస్యలున్నా త్వరగా తెలుస్తాయి, మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండగలరు” అని వివరించారు.
హైదరాబాద్‌లోని వేగవంతమైన జీవితంలో సింధు చెప్పే విషయాలు చాలా ముఖ్యం. “ఏదో సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లడం కాకుండా ఏటా వైద్యపరీక్షలు చేయించుకోవడం అవసరం. అనారోగ్యం వచ్చినప్పుడు పరుగెత్తడం కంటే ముందస్తు వైద్య పరీక్షలకు తప్పకుండా వెళ్లాలి. మీరు పతకాల కోసం ప్రయత్నిస్తున్నా, డెడ్‌లైన్లు వెంటాడుతున్నా, లేదా ఫిట్‌గా ఉన్నా కూడా ఎర్రజెండా వచ్చేవరకు ఆగద్దు. వైద్యపరీక్షలను ఒక అలవాటుగా చేసుకోండి” అని కోరారు.
మహిళలు తమ ఆరోగ్యాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తారని సింధు అన్నారు. “ఆరోగ్యం విషయంలో అలసత్వాన్నుంచి మనం స్వాతంత్య్రం పొందాలి. డాక్టర్ గూగుల్‌ను నమ్మకండి.. వైద్య పరీక్షలు చేయించుకోండి. ఏదైనా జరిగేవరకు వేచి చూడడం మంచిది కాదు. ఈ లోపే స్పందించాలి. జీవితంలో వెనకబడిపోవడం కాకుండా ఏది అవసరమో దానిపై దృష్టిపెట్టే స్వేచ్ఛ మీకు ముందస్తు వైద్యపరీక్షలతో వస్తుంది” అని సింధు తెలిపారు.
ఈ సందర్భంగా కేశవరెడ్డి మాట్లాడుతూ, “ఇళ్లలోనైనా, ఆఫీసుల్లోనైనా మహిళలు తమ గురించి తక్కువ ఆలోచిస్తారు. మంచి ఆరోగ్య స్వేచ్ఛ అంటే మీ సొంత అవసరాలు, విశ్రాంతి, సంపూర్ణ ఆరోగ్యం, ఎప్పటికప్పుడు ముందస్తు వైద్య పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వడమే. ఇవన్నీ లగ్జరీలు కావు.. అత్యవసరమైనవే. చిన్న చిన్న అలవాట్లే మీ జీవితాన్ని కాపాడతాయి. చిట్టచివరి నిమిషంలో పరుగెత్తాల్సిన పని ఉండదు” అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ప్రముఖ డయాబెటాలజిస్టు డాక్టర్ ఎన్‌జీకే శాస్త్రి కూడా సమస్యలను ముందుగా గుర్తించి, నివారణ చర్యలు తీసుకుంటే దీర్ఘకాల ఆరోగ్య ప్రయోజనాలు ఎలా కలుగుతాయో సవివరంగా చెప్పారు.
జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నస్టిక్స్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ తొలి సంవత్సరంలోనే రోగుల అవసరాలకు సమగ్ర పరిష్కారాలు అందిస్తూ, 17 విభాగాలకు సంబంధించిన ఓపీడీ కన్సల్టేషన్లు, సమగ్ర వైద్యపరీక్షలు, డేకేర్ శస్త్రచికిత్సలు, నివారణ చికిత్సలు చేస్తూ సమగ్ర ఆస్పత్రిగా ఎదిగింది.
ముందస్తు వైద్య పరీక్షలు కేవలం అథ్లెట్లకు మాత్రమే కాదని ఈ చర్చలో చివరగా తేల్చారు. సింధు అయితే ఒకే సూత్రం చెబుతారు.. మీ శరీరం మరమ్మతులు కోరుకోకముందే దానిని చూడండి. అది మీ జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటుంది.